Telangana: ఇకపై ఇంటర్ కాలేజీలు ఉండవా.? విద్యా వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు

Published : Jul 04, 2025, 11:49 AM IST

పదో తరగతి పోల్చితే ఇంటర్‌లో ఉత్తీర్ణ‌త శాతం త‌గ్గుతుంద‌నే విష‌యం తెలిసిందే. గ‌త గ‌ణంకాలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే ఇక‌పై ప్ర‌తీ విద్యార్థి క‌చ్చితంగా ఇంట‌ర్ పూర్తి చేయాల‌నే దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటోంది. 

PREV
15
డ్రాప్‌ఔట్స్‌పై రేవంత్ ఆందోళ‌న

ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయాల్సిందేనన్న దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉన్నా, ఇంటర్‌లో అదే స్థాయి కొనసాగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షలో, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ తగ్గుదలకి గల కారణాలను గుర్తించి తగిన పరిష్కారాలను వేగంగా అమలు చేయాలన్నారు.

25
ఇతర రాష్ట్రాల నమూనాలపై అధ్యయనం చేయండి

విద్యార్థుల డ్రాప్‌ఔట్ రేటు తగ్గించే చర్యల్లో భాగంగా, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విద్యా విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ విద్య పాఠశాలల ద్వారా కల్పించడంతో విద్యార్థుల మధ్య తరగతులు మానేసే సంఖ్య తక్కువగా ఉంటోందని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో స్కూల్ విద్యను 12వ తరగతి వరకు కలిపే అవకాశంపై అధ్యాయ‌నం చేసి, రిపోర్ట్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా పాఠశాల స్థాయి నుంచే ఇంటర్ విద్యకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు.

35
విద్యా కమిషన్, ఎన్జీఓలు, పౌర సమాజ సూచనలతో

విద్యార్థుల బవిష్యత్తును తీర్చిదిద్దే ఇంటర్ స్థాయిని మరింత బలోపేతం చేయాలంటే, ప్రత్యేక‌మైన సూచనలు అవసరం అని సీఎం అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యా కమిషన్‌తో పాటు రంగంలోని ప్రముఖ ఎన్‌జీవోలు, పౌర సమాజ ప్రతినిధుల సూచనలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.

45
ఇంటర్‌పై అసెంబ్లీలో చర్చ

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చ నిర్వ‌హిస్తామ‌ని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేరిక మాత్రమే కాకుండా, వారి హాజరుపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇంట‌ర్‌లో చేరిన‌ విద్యార్థులు తరగతులకు రెగ్యుల‌ర్‌గా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షల్లో సగటున ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు ఫెయిలవుతున్నారని పేర్కొంటూ, ఈ పరిస్థితిని మార్చేందుకు 100% పాస్ రేట్ లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు తెలిపారు.

55
‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్’ పనులపై సీఎం సమీక్ష

ఇతర అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో, ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్’ డిజైన్లను ముఖ్యమంత్రి సమీక్షించారు. స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచిస్తూ, ప్రతి పాఠశాలలో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

నిర్మాణ కార్యక్రమంపై ప్రతి వారం అప్డేట్స్ ఇవ్వాలని కోరారు. అదే విధంగా, వీరనారి చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటవుతున్న మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ ప్రణాళికను కూడా పరిశీలించి, టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories