Telugu States Weather Update : సంక్రాంతి పండగ వేళ అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. వర్షాలు లేవు… పెద్దగా చలి లేదు… ఉదయం పొగమంచులో పల్లెలు కొత్త అందాలను సంతరించుకున్నాయి.
IMD Cold Wave Alert : సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పండక్కి ముందు వర్షాలు కంగారుపెట్టినా ప్రస్తుతం ఎక్కడా కురవడంలేదు. గత రెండు నెలలుగా చలి ఇరగదీయగా ప్రస్తుతం సాధారణ శీతాకాలం టెంపరేచర్స్ నమోదవుతున్నాయి... అంటే చలి బాగా తగ్గిందన్నమాట. ఇలా చలిగాలలు, వర్షాలు లేకపోకపోవడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
25
తెలంగాణ వెదర్...
తెలంగాణ విషయానికి వస్తే ఇటీవల చిరుజల్లులు కురిశాయి.. హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి వంటి జిల్లాల్లో అక్కడక్కడా కురిసిన వానలు కాస్త కంగారుపెట్టాయి. కానీ ఈ వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు బాగా పెరిగి చలిగాలుల తీవ్రత తగ్గింది. గతంలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదైన జిల్లాల్లోనూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగాయి... మరికొద్దిరోజులు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
35
తెలంగాణలో అత్యల్ప టెంపరేచర్స్ ఇక్కడే..
ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈరోజు (16 జనవరి) చలి కాస్త ఎక్కువగా ఉంటుందట... ఈ జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని... చలి సాధారణంనే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
నిన్న గురువారం (జనవరి 15న) ఆదిలాబాద్ లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మెదక్ లో 15.5, రామగుండంలో 16.4, హన్మకొండలో 16.5, నల్గొండలో 18, నిజామాబాద్ లో 18.3. భద్రాచలంలో 18.8, ఖమ్మంలో 19.6. మహబూబ్ నగర్ లో 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యల్పంగా హయత్ నగర్ లో 14.6, రాజేంద్ర నగర్ లో 15, పటాన్ చెరులో 15.4, హకీంపేటలో 18.4, బేగంపేటలో 18.5, దుండిగల్ లో 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
55
ఏపీ వెదర్ అప్ డేట్
ఆంధ్ర ప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా మిగతాచోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కనిష్ఠంగా 7 డిగ్రీల టెంపరేచర్ ఉంది... ఇలాగే మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మిగతాచోట్ల 10 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి... అయితే చాలాప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఇలా కనుమ రోజు అటు తెలంగాణ, ఇటు ఏపీ గ్రామాల్లో తక్కువగా చలి ఉండి, పొగమంచుతో కూడిన వాతావరణం కనువిందు చేస్తోంది.