
Journalists Arrests : ప్రజలకు వార్తలు అందించే జర్నలిస్టులో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రముఖ తెలుగుమీడియా సంస్థ ఎన్టివి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు, జర్నలిస్టుల అరెస్ట్ సంచలనంగా మారింది. మీడియా గొంతునొక్కే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దాష్టికానికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు, జర్నలిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారం రేపుతోంది... ప్రజల్లో కూడా దీనిపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో జర్నలిస్టుల అరెస్ట్, ఎన్డివి కార్యాలయంలో సోదాలకు దారితీసిన పరిణామాలేమిటో తెలుసుకుందాం.
ఇటీవల ఓ మహిళా జర్నలిస్టుతో ఓ మంత్రి సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఈ విషయం సదరు మంత్రి ఇంట్లో తెలిసిందని... ఈ పంచాయితీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరిందని సోషల్ మీడియాలో మరింత జోరుగా ప్రచారం జరిగింది. ఈ అంశంపై ఎన్టివి కూడా ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.. ఇదే ప్రస్తుతం జర్నలిస్టుల అరెస్టుకు కారణమయ్యింది.
మహిళా ఐఏఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇంతటితో ఆగకుండా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుచేసింది ప్రభుత్వం... ఈ టీమ్ తాజాగా ఎన్టివి కార్యాలయంలో పలుమార్టు సోదాలు నిర్వహించింది. అంతేకాదు ఈ న్యూస్ ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ పరిపూర్ణ చారి, సుధీర్ లను అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి రిపోర్టర్ల అరెస్ట్ జరగ్గా బుధవారమంతా ఈ వ్యవహారంపై పెను దుమారం రేగింది.
ఎన్టివి జర్నలిస్టుల అరెస్ట్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష పార్టీలు మీడియా గొంతునొక్కే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి... వెంటనే జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నాయి. వైసిపి అధినేత వైఎస్ జగన్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు రామచంద్రారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీమంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు జర్నలిస్టుల అరెస్టును ఖండించారు.
ఇక జర్నలిస్టుల అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి... టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ చర్యలను ఖండించారు. అర్థరాత్రి అరెస్టులు సరికాదని... చట్టప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల అరెస్టుతో రాష్ట్రంలో అలజడి రేగిందని... ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచిదికాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారం మీ దృష్టికి వచ్చిందని భావిస్తున్నాను అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే రాత్రికి రాత్రి ఇంటి తలుపులు పగలగొట్టిమరీ జర్నలిస్టులను మీ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది... మీ సహచర నాయకుడు రేవంత్ రెడ్డి పాలన ఇలా ఉంది చూడండి..! అంటూ రాహుల్ గాంధీకి సూచించారు కేటీఆర్.
మహిళా ఐఏఎస్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన జర్నలిస్టులకు బెయిల్ లభించింది. మంగళవారం రాత్రి జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్, పరిపూర్ణాచారిని అరెస్ట్ చేసి బషీర్ బాగ్ సిసిఎస్ కు తరలించారు... అయితే విచారణ అనంతరం పరిపూర్ణాచారిని పంపేశారు పోలీసులు. మిగతా ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరారు పోలీసులు... ఇందుకు నిరాకరించిన న్యాయస్థానం ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
పాస్ పోర్టులు సరెండర్ చేయాలని... రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్ ను వదిలి ఎక్కడికి వెళ్లకూడదని సూచిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జర్నలిస్ట్ రమేష్, సుధీర్ ఇద్దరినీ పోలీసులు విడుదల చేశారు.