Weather Update : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి… ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.
Weather Updates : వరుణుడు శాంతించాడో లేదో తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. మొంథా తుపాను తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పెద్దగా వర్షాలు లేవు... అక్కడక్కడ చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. దీంతో హమ్మయ్య అనుకుంటూ ప్రజలు కాస్త ఊరట పొందుతున్న సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమయ్యింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
26
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే
నార్త్, సెంట్రల్, వెస్ట్ తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్ర ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇవాళ (నవంబర్ 07, శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 14.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 17.4, రాజేంద్రనగర్ ప్రాంతంలో 18.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు ఇలాగే తగ్గుతూ చలి తీవ్రత పెరుగుతుందని... నవంబర్ 9న అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరించారు.
36
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం గురువారం (నవంబర్ 06) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 18.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెరు ఈక్రిశాట్ ప్రాంతంలో 19.4, హయత్ నగర్ లో 19.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 34.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో అత్యల్పంగా 20 నుండి 25 డిగ్రీ సెల్సియస్, అత్యధికంగా 29 నుండి 35 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షాల విషయానికి వస్తే తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగానే ఉంటుందని...సాయంత్రంవేళ కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశాలుంటాయని తెలిపింది.
56
ఏపీలో వర్షాలు
ఇదిలావుంటే నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు. దీని ప్రభావంతో శుక్రవారం కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాలకు పిడుగులు కూడా తోడై ప్రమాదకరంగా మారవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది... కాబట్టి వర్ష సమయంలో ప్రజలు చెట్లకింద ఉండరాదని సూచిస్తోంది.
66
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే...
ఏపీ అత్యల్పంగా పాడేరులో 14.2, అరకులో 14.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయని... ఉదయం పొగమంచుతో పాటు చలి తీవ్రగా ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. ఎముకల కొరికే చలితో ప్రజలకు అనారోగ్యానికి గురికావచ్చు... కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.