హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా

Published : Sep 13, 2026, 02:57 PM IST

Hyderabad: ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా మధ్యస్థ ఎత్తున్న భవనాలే కనిపించేవి. కానీ ఇప్పుడు భారీ ఎత్తైన టవర్లు వరుసగా నిర్మాణంలోకి వస్తున్నాయి. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో ఉన్న 5 ఎత్తైన బిల్డింగుల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
స్కైలైన్ కాండోర్.. 243 మీటర్ల ఎత్తుతో సంచలనం

హైదరాబాద్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో స్కైలైన్ కాండోర్ (Candeur Skyline) ఒకటిగా నిలుస్తోంది. పుప్పాలగూడ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టులో నాలుగు భారీ టవర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని టవర్లు సుమారు 243 మీటర్ల ఎత్తు, 59 అంతస్తులతో నిర్మితమవుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో అల్ట్రా-లగ్జరీ 4 BHK అపార్ట్‌మెంట్లు, స్కైవిల్లాలు, ప్రైవేట్ లాబీలు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అంతస్తులో పరిమిత సంఖ్యలో అపార్ట్‌మెంట్లతో ఎక్కువ ప్రైవసీ ఉండేలా డిజైన్ చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భ‌వ‌నాలు హైదరాబాద్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

26
SAS క్రౌన్‌.. 234 మీటర్ల భారీ టవర్లు

కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎస్ఏఎస్ క్రౌన్ కూడా హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఒకటి. ఇందులోని మూడు టవర్లు సుమారు 234.4 మీటర్ల ఎత్తు, 58 అంతస్తులతో ఉన్నాయి. ఈ టవర్లు 2024లో నిర్మాణపరంగా టాప్ అవుట్ అయ్యాయి. SAS Crown‌లో భారీ సైజు లగ్జరీ అపార్ట్‌మెంట్లతో పాటు ప్రీమియం సదుపాయాలను అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎత్తు మాత్రమే కాదు.. భారీ స్థాయిలో నిర్మాణం, పరిమిత సంఖ్యలో నివాస యూనిట్లు ఉండటం కూడా ప్రత్యేకతగా నిలుస్తోంది.

36
కోకాపేట్ మైహోమ్‌.. 222 మీటర్లకు పైగా ఎత్తు

కోకాపేట్‌లోనే నిర్మితమవుతున్న మైహోమ్ 99 మరో భారీ రెసిడెన్షియల్ టవర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిర్మాణ వివరాల ప్రకారం ఈ భవనం సుమారు 222.4 మీటర్ల ఎత్తు, 54 అంతస్తులతో ఉండనుంది. నిర్మాణం 2022లో ప్రారంభమై, 2028లో పూర్తయ్యేలా ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 99 ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు ఉండేలా డిజైన్ చేశారు. విశాలమైన అపార్ట్‌మెంట్లు, పెద్ద బాల్కనీలు, లేక్ వ్యూస్, ప్రీమియం సదుపాయాలతో దీన్ని రూపొందిస్తున్నారు. పై అంతస్తుల్లో ప్రత్యేక సదుపాయాలు, హెలిప్యాడ్ వంటి అంశాలు కూడా ప్రాజెక్టు డిజైన్‌లో భాగంగా ఉన్నాయి.

46
పౌలోమి ప్లాజా.. 200 మీటర్లకు మించిన లగ్జరీ ప్రాజెక్టు

కోకాపేట్‌లోనే మరో భారీ హై-రైజ్ ప్రాజెక్టుగా పౌలోమి ప్లాజా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులోని టవర్లు సుమారు 204–211 మీటర్ల ఎత్తు వరకు ఉండేలా ప్రణాళిక చేసినట్లు వివిధ నిర్మాణ వివరాలు సూచిస్తున్నాయి. 55 అంతస్తుల వరకు ఉన్న ఈ రెసిడెన్షియల్ టవర్లు పూర్తయితే కోకాపేట్ స్కైలైన్‌ను మరింత మార్చే అవకాశం ఉంది. పెద్ద ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చే లగ్జరీ హౌసింగ్ విభాగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. కోకాపేట్‌లో ఇప్పటికే అనేక భారీ టవర్లు ఒకే ప్రాంతంలో నిర్మాణంలో ఉండటంతో, ఈ ప్రాంతం హైదరాబాద్‌లోనే ప్రత్యేకమైన హై-రైజ్ రెసిడెన్షియల్ జోన్‌గా మారుతోంది.

56
ది ట్రైలైట్.. 200 మీటర్లకు చేరువలో భారీ టవర్లు

కోకాపేట్‌లోని ది ట్రైలైట్ (The Trilight) కూడా హైదరాబాద్‌లో వేగంగా ఎదుగుతున్న భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఒకటి. ఇది ఒకే టవర్ కాదు.. పలు టవర్లతో కూడిన పెద్ద రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్. ఇందులో అత్యంత ఎత్తైన టవర్ సుమారు 202 మీటర్లకు పైగా ఉండేలా ప్రణాళిక చేశారు. మరో టవర్ సుమారు 178 మీటర్ల ఎత్తుతో 50 అంతస్తుల వరకు ఉంటుంది. ది ట్రైలైట్ ప్రత్యేకత ఏంటంటే.. ఎత్తైన ఒక్క భవనం నిర్మించడమే కాకుండా, మొత్తం ఒక భారీ రెసిడెన్షియల్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద అపార్ట్‌మెంట్లు, ఆధునిక సదుపాయాలు, మెరుగైన ఓపెన్ స్పేస్‌లతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. దీంతో కోకాపేట్‌లో ఇప్పటికే కనిపిస్తున్న హై-రైజ్ కల్చర్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.

66
హైదరాబాద్ స్కైలైన్ పూర్తిగా మారుతోంది

కోకాపేట్, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో వరుసగా 200 మీటర్లకు పైగా ఎత్తైన భవనాలు రావడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వస్తున్న భారీ మార్పుకు సంకేతంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలో 150 మీటర్లకు పైగా ఎత్తున్న భవనాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని 200 మీటర్లకు పైగా టవర్లు నిర్మాణంలోకి రానున్న నేపథ్యంలో.. హైదరాబాద్ స్కైలైన్ ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల స్థాయిలో మరింత ఎత్తుగా, ఆధునికంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories