Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్

Published : Sep 13, 2026, 08:39 AM IST

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం: అల్పపీడనంతో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా పెద్దగా వర్షాలు లేకుండా పరిస్థితులు కొనసాగాయి. అయితే, తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

25
తెలంగాణలో దంచికొడుతున్న వానలు: హైదరాబాద్‌లో ముసురు

తెలంగాణలోనూ రుతుపవనాల జోరు పెరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ఛాన్స్ ఉండటంతో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

35
ఏపీలో ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగుల వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఇప్పటికే విజయవాడలో బెంచ్ మార్క్ ప్రాంతాలైన బెంచ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్లలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వరద ధాటికి రాకపోకలు స్తంభించాయి. అల్లూరి జిల్లా గంగవరం వద్ద తాత్కాలిక తూరల వంతెన కొట్టుకుపోవడంతో దాదాపు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

45
సముద్రంలోకి వెళ్లొద్దు: విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక

తీర ప్రాంతాల వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని స్పష్టం చేశారు.

55
ప్రభుత్వం ముందస్తు చర్యలు: కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

వర్ష తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories