Published : Jun 28, 2025, 04:08 PM ISTUpdated : Jun 28, 2025, 04:17 PM IST
దొంగ సొత్తుతో పారిపోతున్న ఓ గ్యాంగ్ నే దోచుకుంది మరో ముఠా. థ్రిల్లర్ మూవీని తలపించే ట్విస్ట్ లతో ఈ దొంగతనం సాగింది. ఇది జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున. అసలేం జరిగిందంటే…
Hyderabad Robbery : ఓ గ్యాంగ్ బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామని వ్యాపారిని మోసం చేస్తారు... డబ్బులతో ఉడాయిస్తున్న వీరిని మరో గ్యాంగ్ దోచుకుంటుంది. చివర్లో వీళ్లందరినీ పోలీసులు పట్టుకుంటారు. ఇదేదో థ్రిల్లర్ సినిమా స్టోరీ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఓ రియల్ స్టోరీ... పట్టపగలే నడిరోడ్డుపై సినిమా ట్విస్ట్ లను తలపించే దొంగతనం జరిగింది.
25
హైదరాబాద్ లో ఘరానా దొంగతనం
హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అన్నదమ్ములు చంద్రశేఖర్, నాగరాజు ఈజీ మనీకి అలవాటుపడ్డారు. జల్సాల కోసం తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ వ్యాపారులను మోసం చేయడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం ఓ గ్యాంగ్ ను సిద్దంచేసుకున్నారు... వీరితో కలిసి ఓ బంగారం వ్యాపారి టోకరా వేశారు.
తమ దోపిడీ ప్లాన్ లో భాగంగా సికింద్రాబాద్ లో బంగారం దుకాణం నడిపే హరిరామ్ ను కలిసారు చంద్రశేఖర్, నాగరాజు. వ్యాపారిని తమ మాటలతో మాయచేశారు.. తమవద్ద భారీగా బంగారం ఉందని, దాన్ని మార్కెట్ ధరకంటే తక్కువకే అమ్మేస్తామని నమ్మించారు. వారి మాటలు నిజమేనని నమ్మిన వ్యాపారి ఆ బంగారం కొనేందుకు సిద్దమయ్యాడు. అయితే డబ్బులను కేవలం క్యాష్ రూపంలోనే ఇవ్వాలని కోరగా హరిరామ్ అందుకు అంగీకరించాడు.
35
బంగారం వ్యాపారిని దోచుకున్న గ్యాంగ్
ఈ నెల 18న అంటే గతవారం వీరిమధ్య డీల్ కుదిరింది. చంద్రశేఖర్ గ్యాంగ్ తో వ్యాపారి హరిరామ్ సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ సమావేశమయ్యారు. వ్యాపారి దగ్గరి నుండి డబ్బుల బ్యాగును తీసుకోవాలి... సరిగ్గా బంగారం బ్యాగును ఇచ్చేసే సమయంలో తమ గ్యాంగ్ సభ్యులే పోలీసుల రూపంలో వచ్చిన వ్యాపారిని బెదిరించి డబ్బులు దోచుకోవాలన్నది చంద్రశేఖర్ ప్లాన్. సరిగ్గా ఇలాగే చేశారు... హరిరామ్ దగ్గర రూ.46 లక్షలు దోచుకున్నారు.
హరిరామ్ కు అనుమానం రాకుండా వచ్చింది నిజమైన పోలీసులే అని నమ్మించడానికి అసలైన పోలీసును కూడా తమ గ్యాంగులో చేర్చుకున్నాడు చంద్రశేఖర్. ఇలా అతడి వద్దగల పోలీస్ ఐడీ కార్డును చూపించి ఎస్వోటీ టీమ్ అని నమ్మించారు... హరిరామ్ ను చితకబాది డబ్బులు బ్యాగు తీసుకుని వెళ్లిపోయారు.
బంగారు వ్యాపారి హరిరామ్ దగ్గర దోచుకున్న డబ్బుల బ్యాగు తీసుకుని చంద్రశేఖర్ గ్యాంగ్ సికింద్రాబాద్ నుండి తిరుమలగిరి వైపు ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా వారిని మరో గ్యాంగ్ అడ్డుకుంది. బైక్ ఫైనాన్స్ పెండింగ్ లో ఉందని ఈ గ్యాంగ్ సభ్యుల్లో ఒకరి బైక్ ఆపారు… సరిగ్గా వారివద్దే దోచుకున్న డబ్బుల బ్యాగు ఉంది. వారు కంగారుపడటం చూసి అనుమానం వచ్చి బ్యాగు తెరిచిచూడగా అందులో కరెన్సీ కట్టలు ఉన్నాయి.
ఈ డబ్బులు చూడగానే బైక్ ఫైనాన్స్ విషయం మరిచిపోయిన గ్యాంగ్ వీరిని బెదిరించి డబ్బుల బ్యాగుతో ఉడాయించారు. విషయం తెలిసి చంద్రశేఖర్ గ్యాంగ్ డబ్బులతో పారిపోతున్న గ్యాంగ్ ను వెంబడించింది. ఇలా డబ్బుల కోసం రెండువర్గాలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఇలా ఫస్ట్ గ్యాంగ్ వ్యాపారిని మోసం చేసి దోచుకున్న డబ్బును రెండో గ్యాంగ్ దోచుకుంది.
55
ఈ ఘరానా దోపిడి గురించి ఎలా బైటపడిందంటే...
చంద్రశేఖర్ వర్మ గ్యాంగ్ చేతిలో మోసపోయిన బంగారం వ్యాపారి హరిరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వ్యాపారి మోసపోయానని చెప్పినరోజే రెండు గ్యాంగులు కొట్టుకున్నట్లు తెలుసుకున్నారు. సిసి కెమెరాలను పరిశీలించగా ఈ రెండు ముఠాల సభ్యులు పట్టుబడ్డారు.
మొత్తం 28 మంది నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో మందిని అరెస్ట్ చేయగా మరో 10మంది పరారీలో ఉన్నారు. పట్టుబడినవారి వద్ద రూ.46 లక్షల నగదుతో పాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీస్ ఐడీ కార్డు చూపించి వ్యాపారిని బెదిరించింది నాగర్ కర్నూల్ కు చెందిన కానిస్టేబుల్ కేశవులుగా గుర్తించారు.