Hyderabad: హైదరాబాద్ ఐటీ కేంద్రంగా పేరుగాంచిన మాదాపూర్‌లో మరో భారీ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT సంస్థ సుమారు రూ.350 కోట్ల పెట్టుబడితో లగ్జరీ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
భారీ ఎత్తున చేపట్టనున్న ఈ హోటల్ అభివృద్ధి కోసం చాలెట్ హోటల్స్ లిమిటెడ్ సంస్థతో ప్రీ–లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. మాదాపూర్ మైండ్‌స్పేస్ క్యాంపస్‌లో నిర్మించే ఈ హోటల్ ప్రాజెక్ట్ 2027–28 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికానికి పూర్తయ్యే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ లగ్జరీ హోటల్ సుమారు 5.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొత్తం 330 గదులతో ఆధునిక సదుపాయాలతో హోటల్‌ను రూపొందించనున్నారు. మైండ్‌స్పేస్ రీట్‌కు చెందిన ప్రత్యేక సంస్థ భవన నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. భవనం పూర్తి అయిన తర్వాత ఇంటీరియర్ పనులు, హోటల్ నిర్వహణ బాధ్యతలను చాలెట్ హోటల్స్ నిర్వహించనుంది. చాలెట్ హోటల్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 3,300 గదులతో హోటల్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది.
24
మాదాపూర్ క్యాంపస్‌లో మరో ప్రతిఫ్ఠాత్మక ప్రాజెక్ట్
మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ క్యాంపస్ హైదరాబాద్‌లోని అతిపెద్ద సమగ్ర బిజినెస్ పార్కుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సుమారు 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ అభివృద్ధి చెందింది. ఇక్కడ ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆఫీస్ భవనాలతో పాటు హోటళ్లు, షాపింగ్ సదుపాయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ కొత్త హోటల్ నిర్మాణం పూర్తైతే క్యాంపస్‌లో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
34
ఆఫీస్ స్పేస్‌లకు మాత్రమే కాకుండా..
మైండ్‌స్పేస్ రీట్ ఇప్పటివరకు ప్రధానంగా ఆఫీస్ భవనాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇప్పుడు హోటల్ రంగంలోకి అడుగుపెడుతూ వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా క్యాంపస్‌లో పనిచేసే ఉద్యోగులకు, వ్యాపార ప్రయాణికులకు వసతి సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే సంస్థకు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే అవకాశముంది. దీర్ఘకాలంలో ఆస్తుల విలువ పెరగడానికీ ఇది సహాయపడుతుందని సంస్థ అంచనా వేస్తోంది.
మైండ్‌స్పేస్ రీట్‌కు హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణె, చెన్నై నగరాల్లో కూడా ఆఫీస్ ఆస్తులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 3.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఒక్క మాదాపూర్ క్యాంపస్ సుమారు 1.3 కోట్ల చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉంది. ఇక్కడ వేలాది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త లగ్జరీ హోటల్ నిర్మాణంతో మాదాపూర్ మైండ్‌స్పేస్ క్యాంపస్ వ్యాపార కేంద్రంగా మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.