Hyderabad: పెరుగుతోన్న ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐటీ కారిడార్‌లో మరో భారీ ఫ్లై ఓవర్ రాబోతోంది. ఇంతకీ నిర్మాణం ఎక్కడ రానుంది.? దీంతో ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న గచ్చిబౌలి ప్రాంతం నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. ప్రతిరోజూ వేలాది ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతానికి ప్రయాణిస్తుంటారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జంక్షన్‌ను సిగ్నల్ ఫ్రీ మార్గంగా మార్చే ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లతో కూడిన ఇంటర్‌చేంజ్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. మొత్తం పనులు పూర్తవ్వడానికి 2028 వరకు సమయం పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్, కోకాపేట ఓఆర్‌ఆర్ జంక్షన్ మధ్య TGIIC కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించనుంది. 5 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పు, రూ.700 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించతలపెట్టారు.
25
మూడు ఫ్లైఓవర్లతో భారీ ప్రణాళిక
ఒకే జంక్షన్‌లో మూడు ఫ్లైఓవర్లను నిర్మించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. నగరంలోని వివిధ దిశల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడా ఆగకుండా ముందుకు సాగేందుకు ఈ డిజైన్ రూపొందించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వాహనాల కోసం ఒక ఫ్లైఓవర్, శేరిలింగంపల్లి వైపు ప్రయాణించే వాహనాల కోసం మరో మార్గం, డీఎల్‌ఎఫ్ ప్రాంతం నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం మరో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేకుండా వాహనాలు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
35
ప్రధాన మార్గాలపై ప్రత్యేక ఫ్లైఓవర్లు
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. మొదటి లెవల్‌లో ఐఎస్‌బీ నుంచి డీఎల్‌ఎఫ్ వరకు రెండు దిశల్లో ప్రయాణించే ఫ్లైఓవర్ ఉంటుంది. రెండో లెవల్‌లో సెమీ సర్క్యూలర్ ఆకారంలో రెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. ఒకటి డీఎల్‌ఎఫ్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, మరొకటి ఐఎస్‌బీ రోడ్ నుంచి ఇందిరానగర్ వరకు నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్ల కింద ఇందిరానగర్, గచ్చిబౌలి స్టేడియంను కలిపే అండర్‌పాస్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా కొంతకాలం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అండర్‌పాస్ నిర్మాణం కోసం 18 నుంచి 21 మీటర్ల వెడల్పులో తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో రోడ్డులోని కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రహదారి పక్కన ఉన్న చెట్లను పర్యావరణశాఖ అనుమతితో ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. విద్యుత్ తీగలను కూడా భూగర్భంలోకి మార్చే పనులు చేపడతారు.
ఈ సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. లింగంపల్లి నుంచి వచ్చే వాహనాలను మసీదుబండా మార్గం ద్వారా బొటానికల్ గార్డెన్ సమీపంలో గచ్చిబౌలి రోడ్డులో కలిపేలా మార్గం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ తొలగించే అవకాశం ఉంది.
55
ఐటీ కారిడార్‌కు పెద్ద ఊరట
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల నుంచి బయలుదేరే వాహనాలు తరచుగా ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నాయి. కొత్త ఫ్లైఓవర్లతో ఔటర్ రింగ్ రోడ్ వైపు ప్రయాణం మరింత సులభమవుతుంది. అలాగే కోకాపేట నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. ముఖ్యంగా ఓల్డ్ ముంబై హైవే మీదుగా మెహిదీపట్నం నుంచి శేరిలింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తయితే గచ్చిబౌలి జంక్షన్ నగరంలో అత్యాధునిక ట్రాఫిక్ ఇంటర్‌చేంజ్‌లలో ఒకటిగా మారనుంది.