పెరుగుతోన్న సంతానలేమీ సమస్యల కారణంతో ఐవీఎఫ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ సెంటర్ చేసిన నిర్వాకం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ గోపాలపురంలోని ఓ ప్రముఖ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చుట్టూ తీవ్ర వివాదం రేగింది. ఒక దంపతుల భర్త వీర్యానికి బదులుగా వేరొకరి వీర్యంతో ఐవీఎఫ్ జరిపిన ఘటన బయటపడింది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యి, ఆసుపత్రిలో విస్తృత తనిఖీలు జరిగాయి.
DID YOU KNOW ?
మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎప్పుడు పుట్టిందంటే.?
ఐవీఎఫ్ తొలిసారి 1978లో అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో పుట్టిన తొలి శిశువు పేరు లూయిస్ బ్రౌన్.
25
అసలు విషయం వెలుగులోకి ఎలా వచ్చింది.?
మారేడ్‌పల్లికి చెందిన ఓ దంపతులు సంతానం కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌ను ఆశ్రయించారు. చికిత్స అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే, రెండు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత బాబు ఆరోగ్యం క్షీణించింది. తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో వైద్యులను సంప్రదించారు.
పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. కుటుంబ చరిత్రలో ఎవరికీ క్యాన్సర్ వచ్చిన సందర్భాలు లేకపోవడంతో అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించారు. బాబు తండ్రితో జీన్స్ సరిపోలకపోవడంతో ఆసుపత్రి మోసం వెలుగులోకి వచ్చింది.
35
రంగంలోకి పోలీసులు
ఫిర్యాదు అందుకున్న గోపాలపురం పోలీసులు, నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో శనివారం సెంటర్‌పై దాడులు నిర్వహించారు. క్లూస్ టీమ్, రెవెన్యూ అధికారులు, వైద్య విభాగం సహకారంతో రికార్డులను పరిశీలించి, పేషెంట్ ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
డాక్టర్ నమ్రతపై ఇదే మొదటి ఆరోపణ కాదని విచారణలో వెలుగులోకి వచ్చింది. పది సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలను సరోగసీకి బలవంతం చేసి, డబ్బు వసూలు చేసిన ఘటనలో ఆమెను అరెస్ట్ చేసి లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఇతర వైద్యుల పేర్లతో సెంటర్లను కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
55
ఇతర కేంద్రాలపై కూడా దర్యాప్తు
ప్రస్తుత కేసుతో పాటు విజయవాడ, విశాఖపట్నం సహా పలు చోట్ల సృష్టి బేబీ సెంటర్‌ల కార్యకలాపాలపై పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. విశాఖ కేంద్రంలోని రికార్డులు కూడా పరిశీలించగా, అక్కడి మహిళా మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారన్న అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.