మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడం మరో రంగంపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా కొబ్బరి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కొబ్బరి సాగులో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం రంజాన్ నెల కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.
కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలకు పంపేందుకు సిద్ధం చేసిన కాయలు ఇప్పుడు ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల వద్దే నిలిచిపోయాయి. యుద్ధ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు అయోమయంలో ఉన్నారు.
కొబ్బరి ధరల్లో భారీ పతనం
ఇటీవల శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్‌లో ధరలు మంచి స్థాయిలో ఉన్నాయి. వెయ్యి పచ్చి కాయలు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయమయ్యాయి. శ్రీరామనవమి సమయానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ వస్తుందని వ్యాపారులు ఆశించారు. కానీ ఎగుమతులు నిలిచిపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పోర్టుల్లో నిలిచిపోయిన సరుకు స్థానిక మార్కెట్‌లోనే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం వెయ్యి కాయల ధర రూ.13 వేల నుంచి రూ.14 వేల మధ్యకు పడిపోయిందని వాపోతున్నారు.