హైద‌రాబాద్‌లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా ఇళ్లు.. ఇందిర‌మ్మ ఇండ్ల ట‌వ‌ర్స్‌కి శంకుస్థాప‌న, ఎక్కడంటే..

Published : Aug 13, 2026, 08:40 PM IST

Hyderabad: హైద‌రాబాద్‌లో పేద‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేసే దిశంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కూక‌ట్ ప‌ల్లిలో ఇందిర‌మ్మ ఇండ్ల ట‌వ‌ర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.

PREV
15
ఇందిర‌మ్మ ఇండ్ల ట‌వ‌ర్స్

తెలంగాణలో గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, తమ ప్రభుత్వం చేపట్టిన రెండేళ్ల పాలనను ప్రజలు పరిశీలించి తేడాను గమనించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టణ పేదల కోసం చేపడుతున్న గృహ నిర్మాణం, కూకట్‌పల్లి అభివృద్ధి అంశాలపై మాట్లాడారు.

కూకట్‌పల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

కూకట్‌పల్లి ప్రజలు గతంలో తనకు ఇచ్చిన మద్ధతును సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఈ ప్రాంత ప్రజలు తనను ఆదరించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపారని చెప్పారు. అప్పట్లో తాను ప్రతిపక్షంలో ఉండటంతో పాటు గత ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కూకట్‌పల్లి అభివృద్ధికి ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రాంత ప్రజలు తమకు అవసరమైన పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పూర్తి చేయించుకోవాలని సూచించారు.

25
పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ ప్రాజెక్టు ఉద్దేశమని సీఎం చెప్పారు. తొలి దశలో లక్ష ఇళ్లను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో హామీలు ఇచ్చిన వారు వాస్తవంగా ఎంతమందికి ఇళ్లు అందించారో ప్రజలు ఆలోచించాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మాత్రం పట్టణ పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

కూకట్‌పల్లి ప్రజల సొంతింటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భూములు 22-ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లిన సందర్భాల్లో నిజమైన భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. ఒక సర్వే నంబర్‌లో పెద్ద మొత్తంలో భూమి ఉన్నప్పుడు మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఎదురవుతున్న సమస్యలను సబ్‌ డివిజన్లు, సబ్‌ నంబర్ల ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

35
సంక్షేమ పథకాలతో మహిళలకు ఆర్థిక అండ

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పటివరకు సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని నిలిపివేయాలనే ఉద్దేశంతో కొందరు ప్రతిపక్ష నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారని సీఎం ఆరోపించారు. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మహిళా సంఘాలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందన్నారు.

స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెట్రోల్‌ బంకులు, సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించేందుకు శిల్పారామంలో స్టాళ్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అర్హులైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం వంటి పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. సంక్షేమంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

45
బీఆర్‌ఎస్‌పై సీఎం తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని, రాష్ట్రంలో కరవు రావాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొందరు కర్ణాటకకు వెళ్లి క్షుద్రపూజలు చేశారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పరిస్థితిని ఉద్దేశించి ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మంచి జరగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సీఎం సూచించారు. రాష్ట్రానికి నష్టం కలగాలని కోరుకునే వారి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. తెలంగాణను విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

55
అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలే నిర్ణయించాలి

గత పదేళ్ల పాలనలో జరిగిన పనులను, కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు స్వయంగా పరిశీలించాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పేదలు, మహిళలు, రైతులు, స్వయం సహాయక సంఘాలు, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోందన్నారు. కూకట్‌పల్లి సహా హైదరాబాద్‌లోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి, అర్హులైన పేదలకు ఇళ్లు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో తెలంగాణను మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories