Hyderabad: హైదరాబాద్ నుంచి సోమశీల, శ్రీశైలం వెళ్లే భక్తులు, పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త అవకాశాన్ని తీసుకొస్తోంది. ఆకాశ మార్గంలో ఈ పుణ్యక్షేత్రాలకు చేరుకునే హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
హెలికాప్టర్ సేవల ద్వారా హైదరాబాద్ నుంచి సోమశీలకు చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లేలా ప్రత్యేక ప్యాకేజీ రూపొందించారు. ఈ ప్రయాణంలో కృష్ణా నది పరిసరాలు, నల్లమల అరణ్య ప్రాంతం వంటి ప్రకృతి అందాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం ఉంటుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశీల ప్రాంతం ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి. అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేలా యాత్రను రూపొందించారు. పర్యటనతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఈ సేవలను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
25
ఒకరోజు ప్యాకేజీ వివరాలు
ఒకరోజు ప్యాకేజీ ఎంపిక చేసుకున్నవారు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మొదట సోమశీల ప్రాంతానికి చేరుకుని కృష్ణా నది పరిసరాలను వీక్షిస్తారు. అనంతరం లలితాంబిక సోమేశ్వర ఆలయంలో దర్శనం ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం పూర్తి చేసి అదే రోజు సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి సుమారు రూ.1,10,000గా నిర్ణయించారు.
35
రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీ
రెండు రోజులు టూర్ ప్లాన్ చేసుకున్న వారి కోసం రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో సోమశీల, శ్రీశైలంలో బస, భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆలయాల్లో వీఐపీ దర్శనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో అదనపు వసతి సదుపాయం కూడా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ రెండు రోజుల టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి సుమారు రూ.1,40,000గా ఉండనుంది.
ఈ యాత్ర కోసం బెల్-407 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఈ సేవలను నిర్వహించనుంది. ప్రయాణికుల భద్రత, సమయపాలనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో సౌకర్యవంతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా చెబుతున్నారు.
55
కొల్లాపూర్ ప్రాంతానికి పర్యాటక గుర్తింపు
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ హెలీ టూరిజం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుందని తెలిపారు. ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హెలికాప్టర్ సేవలు ప్రారంభమైతే సోమశీల, శ్రీశైలం ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.