హైదరాబాద్ హలీం రికార్డులు :
రంజాన్ మాసంలో అంటే గత మార్చినెలలో హైదరాబాద్ లో ఏకంగా 6 వేలకు పైగా హలీం కేంద్రాలు వెలిసినట్లు సమాచారం. పిస్తా హౌస్, షా గౌస్, బావర్చీ, మెహఫిల్ వంటి పెద్ద రెస్టారెంట్లు వీటికి అదనం. ఇలా నగరంలో ప్రతిరోజూ లక్షలాది కిలోల హలీం విక్రయాలు జరిగాయి... చిన్న విక్రయ కేంద్రాల్లో రోజుకు సగటున 100 నుండి 200 ప్లేట్లు, పెద్ద రెస్టారెంట్స్ లో 500 నుండి 1000 ప్లేట్ల హలీం విక్రయాలు జరిగాయి.
నగరంలో హలీం ధర ఒక్కోచోట ఒక్కోలా ఉంది... కొన్ని రెస్టారెంట్లతో ఒక్కరు తినే సింగిల్ హలీం 300 ఉండగా ఫ్యామిలీ ప్యాక్ రూ.600 నుండి రూ.800 వరకు అమ్మారు. ఇలా రోజుకు రూ.30 నుండి రూ.35 కోట్ల వరకు హలీం వ్యాపారం జరిగిందని అంచనా. వారాంతాల్లో అంటే శుక్ర, శని, ఆదివారాల్లో హలీం అమ్మకాలు మరింత ఎక్కువగా జరిగేవని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాతబస్తీతో పాటు మిగతా హైదరాబాద్ ప్రాంతంలో కంటే సైబరాబాద్ ప్రాంతంలో హలీం విక్రయాలు జోరుగా సాగాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హలీంకు డిమాండ్ పెరిగిందని... 20 శాతం అధికంగా అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటల్ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం హోటల్స్ లోనే కాదు ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలో కూడా గత నెల హలీం ఆర్డర్లే ఎక్కువగా వచ్చాయట. ఇలా హైదరాబాద్ హలీం అమ్మకాల విషయంలో రికార్డులు బద్దలుకొట్టింది.