Hyderabad: రోజురోజుకీ హైదరాబాద్‌లో జనాభా పెరుగుతోంది. దీంతో క్రమంగా నగర విస్తీరణం సైతం పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్, కొత్తగా నిర్మిస్తున్న ట్రిపులార్ రోడ్ల మధ్య టౌన్ షిప్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికల వేస్తున్నారు.
హైదరాబాద్ నగర భవిష్యత్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ కీలక అడుగు వేసింది. సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళికలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించింది. ఈ రోడ్లు అమల్లోకి వస్తే నగర పరిసర ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కొత్త కేంద్రాలుగా మారనున్నాయి.
25
16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు… అభివృద్ధికి స్పీడ్ పెంచే ప్లాన్
ఓఆర్‌ఆర్ నుంచి నేరుగా ఆర్‌ఆర్‌ఆర్ వరకు చేరుకునేలా మొత్తం 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను ప్రతిపాదించారు. ఇప్పటికే రావిర్యాల–ఆమన్‌గల్ మధ్య 41 కిలోమీటర్ల తొలి రోడ్డు ప్రణాళిక ముందుకు సాగుతోంది. దీనితో పాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కిలోమీటర్ల రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు డీపీఆర్ సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మార్గాల వెంట భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
35
బుద్వేల్–కోడంగల్ కారిడార్…
రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు బుద్వేల్ నుంచి చందన్‌వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ ప్రాంతాల మీదుగా కొడంగల్ వరకు విస్తరించనుంది. ఈ రూట్ టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను నేరుగా అనుసంధానం చేస్తుంది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధితో పాటు రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు, లేఅవుట్‌లు, లాజిస్టిక్ హబ్స్‌కు డిమాండ్ భారీగా పెరగనుంది.
ప్రభుత్వం 2047 నాటికి రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే టౌన్‌షిప్‌ల అభివృద్ధి కూడా ఈ ప్రణాళికలో భాగమే. కొత్త రోడ్లతో రాకపోకలు సులభం కావడంతో నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలు కూడా రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మారే అవకాశం ఉంది.
55
మాస్టర్ ప్లాన్–2050 ప్రభావం…
హెచ్‌ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్–2050లో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, లాజిస్టిక్స్, మౌలిక వసతుల అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం ఉంది. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు అందుబాటులోకి వస్తే రాకపోకల సమయం తగ్గుతుంది. దీని ప్రభావంతో భూముల ధరలు, వాణిజ్య విలువలు దీర్ఘకాలంలో భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.