Hyderabad: హైదరాబాద్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ చూపించిన ధైర్యసాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. నగరంలోని బేగం బజార్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ ప్రయత్నాన్ని ఓ ఆటో డ్రైవర్ అడ్డుకొని నిందితుడిని పోలీసులకు పట్టించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
మంజు ఓంలత అనే మహిళ తన కోడలితో కలిసి మార్చి 4వ తేదీన మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. అదే సమయంలో సోహెల్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. చైన్ లాక్కొని పారిపోతుండగా నిందితుడి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో మహిళ వెంటనే గట్టిగా కేకలు వేసింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే తెల్లవారు జామున కావడంతో అక్కడ పెద్ద జనాలు లేరు.
24
ఆటోతో ఢీకొట్టి నిందితుడిని అడ్డుకుని..
అయితే అదే సమయంలో అటుగా ఆటోలో వెళ్తున్న మహ్మద్ జహీర్ అనే డ్రైవర్ ఈ ఘటనను తన రియర్ వ్యూ మిర్రర్‌లో గమనించాడు. దాదాపు 100 మీటర్లు ముందుకు వెళ్లిపోయినా వెంటనే ఆటోను తిరిగి సంఘటన స్థలానికి తీసుకొచ్చాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. జహీర్ తన ఆటోను అతడి బైక్‌కు బలంగా ఢీకొట్టాడు. దీంతో నిందితుడు కిందపడిపోయాడు. అయితే అక్కడితో ఆగని సోహెల్ ఆటో డ్రైవర్‌పై దాడి చేశాడు. అయినా జహీర్ భయపడకుండా అతడిని అడ్డుకొని పారిపోకుండా నిలువరించాడు. కొద్ది సేపటికే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
34
ఆటో డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు
అయితే ఈ సాహసం చేసిన అనంతరం జాహెర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడున్న సీసీటీవీ దృశ్యాల్లో జాహెర్ సాహసాన్ని గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా జాహెర్‌ను గుర్తించారు. జాహెర్ సాహసాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ మంగళవారం (మే 05) ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కార్యాలయంలో జాహెర్‌కు ప్రశంసా పత్రం, నగదు పురస్కారాన్ని అందజేశారు. “నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు”. అని కొనియాడారు.
ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో సోహెల్ పాత నేరస్థుడిగా తేలింది. అతడిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 16 కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల్లో ఇలాంటి బాధ్యతాయుతమైన స్పందన చాలా అవసరం అని కమిషనర్ పేర్కొన్నారు. నేరాలు జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు.