Hyderabad: ఇందుకు క‌దా జ‌నాలకు హైద‌రాబాద్ అంటే పిచ్చి.. వైర‌ల్ అవుతోన్న ఉద్యోగి వీడియో

Published : May 07, 2026, 11:58 AM IST

Hyderabad: 30 ఏళ్ల పాటు ఢిల్లీలో జీవించిన ఓ వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైద‌రాబాద్ గొప్ప‌త‌నాన్ని వివ‌రిస్తూ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

PREV
15
ఢిల్లీలో ఎప్పుడూ భయంతోనే జీవితం

న్యూ ఢిల్లీకి చెందిన పర్వ్ శర్మ యోధా అనే వ్యక్తి ఉద్యోగ కారణంగా తన భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తన మానసిక ప్రశాంతత పెరిగిందని, భయాందోళనలు తగ్గిపోయాయని అతను వెల్లడించాడు.పర్వ్ శర్మ మాట్లాడుతూ ఢిల్లీలో జీవితం ఎప్పుడూ అప్రమత్తతతోనే సాగేదని తెలిపాడు. బయట రోడ్డుపై ఫోన్ మాట్లాడటం, నగలు ధరించడం వంటి సాధారణ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేదని చెప్పాడు.

చోరీలు, వేధింపుల భయం కారణంగా చాలా మంది ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుంటూ నడిచేవారని తెలిపాడు. ముఖ్యంగా మహిళలు రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్తే కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం సాధారణమైపోయిందని చెప్పాడు. లొకేషన్ ట్రాక్ చేయడం, ఫోన్‌లో నిరంతరం మాట్లాడటం వంటి అలవాట్లు అక్కడ సాధారణంగా మారిపోయాయని వివరించాడు.

25
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మారిన జీవితం

హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తన ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చిందని పర్వ్ తెలిపాడు. ఇప్పుడు తాను, తన భార్య రాత్రి వేళల్లో కూడా బయట నడవడానికి భయపడటం లేదని చెప్పాడు. తన భార్య పని కోసం లేదా ఇతర అవసరాల కోసం ఒంటరిగా బయటకు వెళ్లినా ముందు లాగే టెన్షన్ అనిపించడం లేదని వెల్లడించాడు. హైదరాబాద్ నగరాన్ని తాను సురక్షితమైన నగరంగా భావిస్తున్నానని తెలిపాడు.

35
తెలంగాణ పోలీసులపై ప్రశంసలు

పర్వ్ శర్మ తెలంగాణ పోలీసుల పనితీరును కూడా ప్రశంసించాడు. రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్న తనను కేవలం ఒక్కసారి మాత్రమే పోలీసులు రొటీన్ చెకింగ్ కోసం ఆపారని తెలిపాడు. అప్పుడు కూడా పోలీసులు చాలా గౌరవంగా, సహాయకంగా వ్యవహరించారని చెప్పాడు. ఈ అనుభవం వల్ల నగరంపై తనకు మరింత నమ్మకం పెరిగిందని పేర్కొన్నాడు.

45
హైదరాబాద్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది

హైదరాబాద్ తన జీవితాన్ని మార్చేసిందని పర్వ్ భావోద్వేగంగా చెప్పాడు. ఈ నగరం వల్ల తనకు మంచి స్నేహితులు దొరికారని, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగిందని తెలిపాడు. కెరీర్ పరంగా కూడా ఎదగడానికి హైదరాబాద్ ఎంతో సహాయపడిందని పేర్కొన్నాడు. “హైదరాబాద్ ఒక నగరం మాత్రమే కాదు.. మనసుకు ప్రశాంతత ఇచ్చే స్థలం” అని అతను వీడియోలో చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది.

55
సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనలు

పర్వ్ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. చాలా మంది హైదరాబాద్ గురించి సానుకూలంగా కామెంట్లు చేశారు. ఓ యూజ‌ర్ స్పందిస్తూ.. “17 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఈ నగరం మనల్ని తనవాళ్లలా చూసుకుంటుంది” అని రాసుకొచ్చాడు. మరో వ్యక్తి “నేను ఢిల్లీకి చెందిన వాడిని. హైదరాబాద్‌లో పెళ్లి అయ్యింది. ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా, సహజంగా ఉంటారు. తెలుగు రాకపోయినా ఎవరూ ఇబ్బంది పెట్టలేదు” అని కామెంట్ చేశాడు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం స‌దరు ఉద్యోగి వీడియోలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించ‌డ‌మైంది. ఇది ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే. ఏ ప్రాంతానికి ఉండే ప్ర‌త్యేక‌త ఆ ప్రాంతానికి ఉంటుంద‌నే విష‌యాన్ని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories