Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు విస్తరణపై దృష్టి పెట్టింది. ఇప్పటికే నగరంలో కీలక ప్రాంతాలను కలుపుతున్న మెట్రో సేవలను ఇప్పుడు శివారు ప్రాంతాలు, భవిష్యత్ అభివృద్ధి కేంద్రాల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
దాదాపు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రెండో దశ ప్రాజెక్టును రూపొందించారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర ఏడు కొత్త కారిడార్లను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (DPR) సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన రవాణా అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
25
ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు కొత్త కారిడార్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న స్కిల్ యూనివర్సిటీ వరకు ప్రతిపాదించిన కొత్త మెట్రో మార్గం ప్రధానంగా నిలుస్తోంది. దాదాపు 40 కిలోమీటర్ల పొడవు గల ఈ కారిడార్‌ను మెట్రో మూడో దశలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మార్గాన్ని ప్రత్యేకంగా వేగవంతమైన ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు కేవలం 40 నిమిషాల్లో చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్ నగర అభివృద్ధికి కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
35
అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్‌గ్రేడ్ ట్రాక్‌ల కలయిక
ఈ కొత్త కారిడార్ నిర్మాణంలో మూడు రకాల సాంకేతిక విధానాలను ఉపయోగించనున్నారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నుంచి కార్గో ప్రాంతం వరకు సుమారు 2 కిలోమీటర్లు భూమి లోపల అండర్‌గ్రౌండ్ మార్గంగా ఉంటుంది. అక్కడి నుంచి పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ప్రాంతాల వరకు దాదాపు 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ ట్రాక్‌పై మెట్రో నడుస్తుంది. రావిర్యాల నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మరో 18 కిలోమీటర్లు భూమి మీదే ఎట్‌గ్రేడ్ విధానంలో ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ నిర్మించనున్న 100 మీటర్ల వెడల్పైన గ్రీన్‌ఫీల్డ్ రహదారి మధ్యలో మెట్రో లైన్‌కు ప్రత్యేక స్థలం కేటాయించారు. రోడ్డు మధ్యలో మెట్రో ట్రాక్ ఉండగా, ఇరువైపులా ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. మధ్యలో పచ్చదనంతో ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను అభివృద్ధి చేసేలా డిజైన్ చేయనున్నారు.
ఈ మార్గంలో మొత్తం 16 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. మన్సాన్‌పల్లి, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకలాన్, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, మీర్‌ఖాన్‌పేట్ వంటి ప్రాంతాలకు ఈ మెట్రో సేవలు చేరనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నగర శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐటీ హబ్‌లు, కొత్త నివాస కాలనీలు మెట్రోతో అనుసంధానమైతే రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, విద్యాసంస్థలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
55
హైదరాబాద్‌ను గ్లోబల్ మెగా సిటీగా మార్చే లక్ష్యం
మెట్రో రెండో, మూడో దశల ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న మెట్రో నెట్‌వర్క్‌కు కొత్త కారిడార్లు జతకావడంతో నగర వ్యాప్తంగా ప్రయాణం మరింత సులభం కానుంది. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజల ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేసే అవకాశం ఉంది. ఓల్డ్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వరకు, ఎయిర్‌పోర్ట్ నుంచి శివారు ప్రాంతాల వరకు మెట్రో అందుబాటులోకి రావడం ద్వారా నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదం తెలిపితే హైదరాబాద్ రవాణా రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.