వందేళ్ల క్రితం అమీర్‌పేట ఎలా ఉండేదో తెలుసా? ఇంత‌కీ ప్రాంతానికి పేరు ఎలా వ‌చ్చిందంటే

Published : Aug 09, 2026, 07:28 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమీర్‌పేట్ ఒక‌టి. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులతో ఈ ప్రాంతం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతానికి "అమీర్‌పేట్" అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

PREV
15
ఆరవ నిజాం కాలంలో మొదలైన అమీర్‌పేట్ కథ

1900 ప్రాంతంలో హైదరాబాద్‌ను ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలించారు. ఆయన పాలనలో నగరం అభివృద్ధి చెందడంతో పాటు పలువురు విశ్వాసపాత్రులైన జాగీర్దార్లకు భూములు, జాగీర్లు బహుమతిగా ఇచ్చేవారు. అలాంటి వారిలో అమీర్ అలీ అనే జాగీర్దార్ కూడా ఒకరు. నిజాంకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరొందిన అమీర్ అలీకి ప్రస్తుతం అమీర్‌పేట్‌గా పిలిచే ప్రాంతంలోని విస్తారమైన భూమిని బహుమతిగా ఇచ్చినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి.

25
అడవిని తలపించే ప్రాంతంలో రాజభవనం

ప్రస్తుతం కాంక్రీట్ భవనాలతో నిండిపోయిన అమీర్‌పేట్ ఒక‌ప్పుడు పచ్చని ప్రకృతితో నిండిన ప్రాంత‌మ‌ని మీకు తెలుసా? అప్పట్లో ఈ ప్రాంతం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చెరువులు, పచ్చని పొలాలు ఉండేవి. ఈ అందమైన ప్రాంతాన్ని చూసిన అమీర్ అలీ ఇక్కడే తన నివాసం కోసం ఒక అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించుకున్నారు. విశాలమైన ప్రాంగణం, ఉద్యానవనాలు, ప్రకృతి మధ్యలో నిర్మించిన ఆ భవనం ఆ కాలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెబుతారు.

35
రాజభవనం నుంచి నేచర్ క్యూర్ ఆసుపత్రి వరకు

కాలక్రమేణా నిజాం పాలన ముగిసింది. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించింది. అమీర్ అలీ నిర్మించిన ఆ రాజభవనం కూడా కొత్త రూపు దాల్చింది. ప్రస్తుతం అదే భవనం నేచర్ క్యూర్ ఆసుపత్రిగా సేవలందిస్తోంది. నేటికీ ఈ భవనం అమీర్‌పేట్ హిస్టరీకి ఒక గుర్తుగా నిలిచింది. ఈ ప్రాంతం గత వైభవాన్ని గుర్తు చేసే అరుదైన నిర్మాణాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు.

45
సాఫ్ట్‌వేర్ కలలకు చిరునామాగా మారిన అమీర్‌పేట్

ఒకప్పుడు ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న అమీర్‌పేట్, నేడు దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే యువతకు కేంద్రంగా మారింది. ఇక్కడ వందల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి వివిధ టెక్నాలజీల్లో శిక్షణ పొందుతున్నారు.

అంతేకాదు, విద్యార్థులు, ఉద్యోగుల కోసం పెద్ద సంఖ్యలో హాస్టళ్లు, పీజీలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ మెట్రోలో అత్యంత కీలకమైన అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ కూడా ఇక్కడే ఉండటం వల్ల నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంది.

55
చరిత్రను మోస్తూనే ఆధునికతలో దూసుకెళ్తున్న అమీర్‌పేట్

అమీర్‌పేట్ అనగానే చాలా మందికి సాఫ్ట్‌వేర్ కోచింగ్ సెంటర్లు, మెట్రో స్టేషన్, రద్దీ రోడ్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈ ప్రాంతం వెనుక నిజాం కాలం నాటి ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. ఆరవ నిజాం తన విశ్వాసపాత్రుడైన జాగీర్దార్ అమీర్ అలీకి బహుమతిగా ఇచ్చిన భూమి నేడు లక్షలాది మంది జీవితాలను మార్చే విద్య, ఉపాధి కేంద్రంగా మారడం విశేషం. ఒక జాగీర్దార్ పేరు మీద ఏర్పడిన ఈ ప్రాంతం, కాలంతో పాటు రూపు మార్చుకున్నప్పటికీ తన చారిత్రక గుర్తింపును మాత్రం ఇప్పటికీ నిలబెట్టుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories