Hyderabad: నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. మరో కీలక మార్గంలో 4 కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది.
వాహనాల సంఖ్య పెరగడంతో హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై రద్దీ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ముఖ్యంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పీక్ అవర్స్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా పంజాగుట్ట–జూబ్లీహిల్స్ మార్గంలో మరో భారీ ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రణాళిక సిద్ధమైంది.
25
నాలుగు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల వంతెన
ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ సర్కిల్ ప్రాంతం నుంచి ప్రారంభమై జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వరకు కొనసాగనుంది. మొత్తం దూరం దాదాపు 4 కిలోమీటర్లు. ఆరు లైన్లతో నిర్మించనున్న ఈ కారిడార్ ద్వారా ఈ రెండు కీలక ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. సిగ్నళ్ల వద్ద ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం తగ్గడంతో ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.
35
ముఫకంజా కాలేజీ వద్ద ఎంట్రీ.. రోడ్డు నంబర్ 36 వరకు కనెక్టివిటీ
ఎలివేటెడ్ మార్గంలోకి వాహనాలు ఎక్కేందుకు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని ముఫకంజా కాలేజీ సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి నుంచి కారిడార్‌ను జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 వైపు అనుసంధానం చేసేలా డిజైన్ చేస్తున్నారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు పై వంతెనపై ప్రయాణించి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రాంతం వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా చెక్‌పోస్ట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కారిడార్ ద్వారా ముఫకంజా కాలేజీ సమీపంలో దిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కోసం జలగం వెంగళరావు పార్క్ వరకు ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది.
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, నిర్మాణ ప్రక్రియపై అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. అయితే మొత్తం పనులకు ఎంత ఖర్చవుతుందనే అంశంపై ఇంకా తుది అంచనా వెల్లడించాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తయితే పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలకు వేగవంతమైన ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. దీనివల్ల కింద ఉన్న ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
55
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రాజెక్టులకు బ్రేక్
మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించాలనే పాత ప్రతిపాదనలకు జీహెచ్‌ఎంసీ తాజాగా వెనక్కి తగ్గింది. గతంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ.1,090 కోట్లతో నిర్మాణాలు చేపట్టాలని భావించారు. ఇందుకోసం మేఘా, కేఎన్‌ఆర్ సంస్థలకు పనులు అప్పగించే దిశగా చర్యలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న వన్‌వే విధానంతో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడింది. దీంతో భారీ మొత్తంలో ఖర్చు చేసి కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసినట్లు సమాచారం.