కల్తీ కల్లు అంటే సహజంగా తాటిచెట్టు నుంచి తీసే కల్లు కాదు. ఇది పూర్తిగా రసాయనాల మిశ్రమంతో తయారు చేసే కల్లు. అక్రమార్కులు ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్, యాంటీ సైకోటిక్, నిమ్మ ఉప్పు, శాక్రీన్, కుంకుడు కాయల రసం, సిల్వర్ వైట్, యూరియా, సోడా యాష్, అమ్మోనియా, డ్రై ఈస్ట్ లాంటి పదార్థాలను మిశ్రమంగా కలిపి కల్లు రూపంలో తయారు చేస్తున్నారు.
డిమాండ్ తగినంత తాటి, ఈత చెట్లు లేకపోవడంతో పూర్తిగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. నిజామాబాద్‌లో ఒక్క రోజులోనే 3 లక్షలకు పైగా కల్తీ కల్లు ఉత్పత్తి అవుతోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్కడ ఒక్క తాటిచెట్టు కూడా లేదు. 2,400 సీసాల కల్లు తయారీకి కేవలం రూ.7,800 మాత్రమే ఖర్చవుతుండడంతో అక్రమార్కులు కల్తీ కల్లు తయారీకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.