Revanth Reddy: కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనైనా చర్చించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, జగన్ బంధంతోనే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. బుధవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుబంధంతో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలతోనే నీళ్ల విషయంలో రాష్ట్రానికి నష్టం జరిగిందని తెలిపారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అధికారులతో కూడిన సమావేశంలో కృష్ణా నదీజలాల పంపకంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీని తర్వాత సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తనను క్లబ్బులు, పబ్బులకు పిలవొద్దని అన్నారు. ప్రజాస్వామ్య చర్చను క్లబ్బులు, పబ్బుల్లో కాకుండా సభలో విలువైన చర్చలు జరగాలన్నారు.
"మీ ఆరోగ్యం సహకరించపోతే.. అసెంబ్లీకి రాలేకపోతే.. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనైనా చర్చకు సిద్ధం. నేను స్వయంగా హాజరై చర్చలో పాల్గొంటా" అని రేవంత్ రెడ్డి అన్నారు.
35
తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం
రాష్ట్రానికి కృష్ణా-గోదావరి నదీ జలాల్లో ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. "దేవుడే ఎదిరించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడతాం. ప్రజలు మాకు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం" అని స్పష్టం చేశారు.
ఈ అంశాలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలని సీఎం కోరారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగే అన్యాయంపై స్పష్టమైన పాలసీ డాక్యుమెంట్‌ను సభ ముందు ఉంచుతామని చెప్పారు. నిపుణులతో చర్చ జరిపే యోచనను వెల్లడించారు.
"తెలంగాణకు శాశ్వత హక్కులు లభించాలంటే స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలి. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం" అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వరద జలాలను వినియోగించుకోవచ్చనే వాదనను సీఎం తోసిపుచ్చారు. ముందుగా నికర జలాల్లో తెలంగాణ వాటా తేలాలన్నారు. అనంతరం ప్రొరేటా పద్ధతిలో మిగిలిన జలాల పంపిణీ జరగాలన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పలు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం పేర్కొన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు పూర్తవకపోవడం, ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు మార్పులు రాష్ట్రాన్ని నష్టానికి గురి చేశాయని వివరించారు.
55
విద్యుత్ ఉత్పత్తిలోనూ నష్టమే
తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తక్కువ ధరకు విద్యుత్ పొందే అవకాశాలను కోల్పోయామని ఆయన చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నీటి ప్రణాళికలు, ఖర్చుల వివరాలు, నియోజకవర్గాల అన్యాయాలపై సీఎం స్పష్టంగా విమర్శించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్న దృక్పథంతో తమ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.