తెలంగాణలో రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని గత రెండుమూడు రోజులుగా వాతావరణ శాఖ చెబుతూ వస్తోంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసింది లేదు. దీంతో ఇప్పటికీ తెలంగాణలో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు తప్పడంలేదు.
మరో రెండుమూడు రోజులు అంటే జులై 13 వరకు తెలంగాణలో చెదురుమదురు జల్లులు తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు (జులై 10, గురువారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది... నిజామాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మంచి వర్షపాతమే నమోదయ్యే అవకశాలున్నాయని తెలిపింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది. హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ లో మధ్యాహ్నం లేదా సాయంత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇలా వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.