తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధానంపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన ప్రకారం జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయి. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు ఇది శిక్షలా మారుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచే ప్రతిపాదన వల్ల పెద్ద రాష్ట్రాలకే ఎక్కువ లాభం జరుగుతుందని అంటున్నారు. ఉత్తర–దక్షిణ మధ్య అంతరం మరింత పెరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్స్‌ను ప్రతిపాదించారు.
* మోడల్ 1 ప్రకారం 50% సీట్లు – జీడీపీ, ఆర్థిక పనితీరు ఆధారంగా, 50% – జనాభా ఆధారంగా కేటాయించాలి.
* మోడల్ 2లో 40% జనాభా, 40% ఆర్థిక పనితీరు, 20% సమాఖ్య సమతుల్యత ఆధారంగా నిర్ణయించాలి.
ఈ విధానంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు న్యాయం, చిన్న రాష్ట్రాలకు రక్షణ, దేశ సమతుల్యత కాపాడే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పునర్విభజన మాత్రమే కాదు – దేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయం. జనాభా ఆధారంగా సీట్లు పెంచాలా? లేక అభివృద్ధి, ఆర్థిక పనితీరు కూడా పరిగణలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు సమాన న్యాయం కోరుతుంటే, కేంద్రం సమగ్ర విధానం అవసరం అని చెబుతోంది. 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఈ వివాదానికి ఎలా తెర దించుతుందో చూడాలి.