HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు

Published : Apr 15, 2026, 11:35 AM IST

HYD: హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇల్లు కొనాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ పెరిగిన ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. అయితే హైద‌రాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసే స్థోమ‌త ఉన్నా.. ఇలా ఆలోచిస్తే మీ జీవితాన్ని బిందాస్‌గా మార్చుకోవ‌చ్చు. అదేలాగంటే

PREV
15
భారంగా మారుతోన్న సొంతింటి క‌ల

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆఫీసులకు సమీపంగా ఇల్లు కొనుగోలు చేయడం చాలా మందికి పెద్ద సవాల్‌గా మారింది. ఒక సాధారణ 2BHK ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఖర్చవుతోంది. ఇంత పెద్ద మొత్తం పెట్టడం అంటే ఎక్కువగా బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా భారీ ఎమ్ఐలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో రోజువారీ ఖర్చులు, కుటుంబ అవసరాలు కూడా పెరుగుతుంటాయి. అయితే అదే ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుంటే నెలకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల మధ్యలో మంచి ఫ్లాట్ దొరుకుతోంది. ఈ తేడా చూసినప్పుడు చాలా మంది కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గుతున్నారు.

25
అద్దెకు ఉంటూ టైర్-2 నగరాల్లో పెట్టుబడి

ఈ పరిస్థితుల్లో ఒక కొత్త ఆలోచన ముందుకు వస్తోంది. హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూనే, సమీపంలోని టైర్-2 నగరాల్లో ఇల్లు కొనుగోలు చేయడం. వరంగల్, సిద్ధిపేట, సంగారెడ్డి వంటి నగరాలు ఇప్పుడు మంచి ఎంపికలుగా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్ ధర సుమారు రూ. 35 నుంచి రూ. 40 లక్షల మధ్యలో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫ్లాట్లకు నెలకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు అద్దె కూడా వస్తుంది. అంటే తక్కువ పెట్టుబడితోనే ఒక ఆస్తి సంపాదించడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. వీటికి అద‌నంగా ఈ ప్రాంతాల నుంచి హైద‌రాబాద్‌కు కేవ‌లం 2.5 గంట‌ల్లోపే చేరుకోవ‌చ్చు.

35
ఒక కోటి పెట్టుబడితో వచ్చే తేడా

ఒకసారి మొత్తం లెక్కలు చూసుకుంటే ఈ స్ట్రాటజీ ఎంత ఉపయోగకరమో అర్థమవుతుంది. హైదరాబాద్‌లో ఒక కోటి పెట్టి ఒకే ఫ్లాట్ కొనుగోలు చేస్తే, దానికి ఎమ్ఐ భారం తప్ప మరో లాభం ఉండదు. కానీ అదే మొత్తాన్ని టైర్-2 నగరాల్లో పెట్టుబడి పెడితే రెండు ఫ్లాట్లు సులభంగా కొనుగోలు చేయవచ్చు. వాటి ద్వారా నెలకు మంచి అద్దె వస్తుంది. ఇంకా కొంత డబ్బు చేతిలో మిగిలే అవకాశం కూడా ఉంటుంది. ఆ డబ్బును ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచుకోవచ్చు లేదా పోస్టాఫీస్ స్కీమ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టి వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు.

45
రిటైర్మెంట్ జీవితానికి ఉపయోగపడే ప్లాన్

ఈ విధానం భవిష్యత్తు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం పూర్తయ్యాక టైర్-2 నగరంలో ఒక ఫ్లాట్‌లో నివసించవచ్చు. మరో ఫ్లాట్ నుంచి వచ్చే అద్దెతో నెలవారీ ఖర్చులు నిర్వహించుకోవచ్చు. అదనంగా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ కూడా సహాయపడుతుంది. ఇలా చూసుకుంటే స్థిరమైన ఆదాయం, తక్కువ ఒత్తిడి, ప్రశాంతమైన జీవితం సాధ్యమవుతుంది.

55
నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సిన అంశాలు

ఇలాంటి పెట్టుబడి చేయడానికి ముందు కొన్ని విషయాలను స్పష్టంగా ఆలోచించాలి. భవిష్యత్తులో మీరు ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారు, కుటుంబ అవసరాలు ఎలా ఉంటాయి, ఆరోగ్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు ఆ నగరంలో అందుబాటులో ఉన్నాయా వంటి అంశాలు పరిశీలించాలి. అలాగే ఆ నగరం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందా లేదా అన్నది కూడా ముఖ్యమే. ఈ విషయాలన్నీ సరిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటే ఈ స్ట్రాటజీ నిజంగా మంచి ఫలితాలు ఇస్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. క‌ష్ట‌ప‌డి సంపాదించిన మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories