Bullet Train: హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన మార్గం, స్టేషన్ల వివరాలపై కీలక వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా సుమారు 607 నుండి 626 కిలోమీటర్ల పొడవునా ఈ మార్గం సాగనుంది.
భారతదేశంలోని రెండు ప్రధాన ఐటీ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) కారిడార్‌కు సంబంధించిన రూట్ మ్యాప్, స్టేషన్ల వివరాలపై ఇటీవల కీలక సమాచారం వెలువడింది. సుమారు 607 నుండి 626 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించి, కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ దక్షిణాదిలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, దక్షిణ భారతదేశంలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు మార్గంగా నిలుస్తుంది. ఇది ముంబై-హైదరాబాద్ లైన్‌కు పొడిగింపుగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సర్వే తుది దశకు చేరుకోగా, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) మార్చి 2027 నాటికి సిద్ధం కానుందని సమాచారం.
25
ప్రతిపాదిత మార్గం, స్టేషన్లు
హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ దాదాపు 607 నుంచి 626 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. ఈ మార్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ కారిడార్‌లో మొత్తం 12 నుండి 15 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రతిపాదిత స్టేషన్లలో హైదరాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, షంషాబాద్‌ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. అలాగే, నల్లమల అటవీ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా ఉన్న మన్ననూర్ సమీపంలో, కృష్ణా నది బ్యాక్‌వాటర్స్ అందాలకు ప్రసిద్ధి చెందిన సోమశిల ప్రాంతంలో, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల సమీపంలో స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ స్టేషన్లు పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
35
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే..
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, ధోన్, గూటి, అనంతపురం, దుద్దెబండ, హిందూపురం వంటి ప్రాంతాల్లో స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. కర్ణాటకలో అలీపుర (గౌరిబిదనూరు తాలూకా), దేవనహళ్లి (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం), కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి వంటి స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు నగరంలోకి ప్రవేశించేటప్పుడు రైలు దాదాపు 12 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగంలో ప్రయాణించే అవకాశం ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుండి బెంగళూరుకు రైలులో ప్రయాణించడానికి 8.5 నుండి 12 గంటల సమయం పడుతోంది. బస్సులో సుమారు 9-10 గంటలు పడుతుంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే, ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు లేదా 3 గంటల లోపునకు తగ్గిపోతుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కారిడార్‌లో రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా రూపొందించారు.
55
త్వరలోనే డీపీఆర్
ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే మద్ధతు ప్రకటించాయి. ఇటీవల కర్ణాటక మంత్రివర్గం కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. భూసేకరణ వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ప్రాజెక్టు నిర్మాణానికి వేగం పెంచనుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ త్వరలో సిద్ధం కానుంది.