
బంగాళాఖాతంలో కలకలం రేపిన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా వేగంగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఈ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరప్రాంత పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
అలాగే ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు. వర్షాలతో పాటు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 65 కిమీ బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట శివారులోని పాములేరు వాగు ఉధృతికి వంతెన రెండు ఖానాలు నేలమట్టమయ్యాయి. దీంతో పాల్వంచ-మందలపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం కంటిమీద కునుకు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
ప్రతి జిల్లాలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లతో పాటు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తేవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, కల్వర్టులు దాటే సాహసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 80కి పైగా ప్రాంతాల్లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది. విశాఖ రూరల్ తులసీనగర్‌లో గరిష్ఠంగా 236 మి.మీ, మధురవాడలో 218 మి.మీ, సీతమ్మధారలో 205 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షాల ధాటికి నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. విపత్తు తీవ్రతపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
వర్షాల వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లా చింతలపాడులో ఈదురుగాలులకు 74 విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో గ్రామం రాత్రంతా చీకటిలోనే ఉండిపోయింది. సుమారు 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వినగడప-తోటమూల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనకాపల్లి ఆర్‌టీసీ కాంప్లెక్స్, రైల్వే బ్రిడ్జి కిందకు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలపై ప్రభావం చూపాయి. బుధవారం రాత్రి విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్ ఇండియా (IX-1373) విమానం భోగాపూర్ వద్ద సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ల్యాండ్ కాలేదు. రెండు గంటల ఉత్కంఠ తర్వాత విమానాన్ని నాగపూర్‌కు తరలించారు. ఇందులో ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. గురువారం ఉదయం ఈ విమానం సురక్షితంగా విజయవాడకు చేరుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. నగరంలో ఎల్లో అలర్ట్ అమలులో ఉంది. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.