ఓరి దేవుడా ఎంతటి విషాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ, భారీగా మృతుల సంఖ్య

Published : Nov 03, 2025, 09:29 AM ISTUpdated : Nov 03, 2025, 09:45 AM IST

Accident: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. 

PREV
16
ప్ర‌మాదం ఎక్క‌డ జ‌రిగింది.?

హైద‌రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన లారీ మీర్జాగూడ సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు లారీపై ఉన్న కంకర మొత్తం బస్సుపై పడింది. దాంతో వాహనంలోని ప్రయాణికులు అందులోనే చిక్కుకున్నారు. సుమారు 17 మంది అక్కడికక్కడే మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పది నెలల చిన్నారితో పాటు బస్సు డ్రైవర్‌, లారీ డ్రైవర్‌ ఉన్నారని అధికారులు తెలిపారు.

26
కొన‌సాగుతోన్న‌ సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చేవెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు జేసీబీల సాయంతో కంకరలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా కంకర కింద కొందరు ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.

36
బస్సులో విద్యార్థులు, ఉద్యోగులు

తాండూరు నుంచి హైదరాబాద్‌ వైపు బయల్దేరిన ఆర్టీసీ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు. వారాంతం కావడంతో స్వగ్రామాల నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిన‌ట్లు తెలుస్తోంది. ప్రమాదంతో హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

46
రంగంలోకి పోలీసులు

సహాయక చర్యల సమయంలో పోలీసులు 15 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. వారిలో బస్సు కండక్టర్‌ రాధ కూడా ఉన్నారు. ఈ ప్రాసెస్‌లో చేవెళ్ల సీఐ భూపాల్‌ శ్రీధర్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఒక జేసీబీ ఆయనపైకి ఎక్కడంతో ఎడమ కాలికి గాయమైంది. ఆయనను వెంటనే చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

56
హృదయ విదారక దృశ్యాలు

ప్రమాద స్థలంలో దారుణ దృశ్యాలు కనిపించాయి. చీకటిలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బంధువులు, స్థానికులు మృతదేహాలను చూసి విలపించారు. పది నెలల చిన్నారి మరణించిన దృశ్యం అంద‌రినీ క‌లిచి వేస్తోంది.

66
బ‌స్సు ప్ర‌మాదంపై ప‌లువురి సంతాపం

చేవెళ్ల బస్సు ప్ర‌మాదంపై ప‌లువురు సంతాపం తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాన‌ని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ప్ర‌క‌ట‌న చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తూ.. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆదుకోవాలని ట్వీట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories