వై-ఫై అనే పేరు ఎలా వ‌చ్చింది.? ఇంత‌కీ దీని అసలు అర్థం ఏంటో తెలుసా.?

Published : Oct 23, 2026, 04:04 PM IST

WiFi Meaning:ప్రస్తుతం ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇంట్లో, ఆఫీసులో, పాఠశాలల్లో, హోటళ్లలో ఎక్కడ చూసినా వై-ఫై సదుపాయం కనిపిస్తోంది.అయితే వై-ఫైకి అస‌లు ఈ పేరు ఎందుకు పెట్టారో మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు.

PREV
15
వై-ఫై అంటే ఏంటి?

వై-ఫై అనేది వైర్లు లేకుండా పరికరాలను ఒక నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసే వైర్‌లెస్ టెక్నాల‌జీ. దీని ద్వారా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు వంటి పరికరాలను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇంట్లో లేదా ఆఫీసులో ఉండే రూటర్ వై-ఫై సిగ్నళ్లను పంపిస్తుంది. ఈ సిగ్నళ్లను అందుకునే పరికరాలు నెట్‌వర్క్‌కు అనుసంధానమవుతాయి.

దీనివల్ల ప్రత్యేకంగా ప్రతి పరికరానికి ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. వై-ఫై సాంకేతికత రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. ఇది WLAN (Wireless Local Area Network) అనే స్థానిక వైర్‌లెస్ నెట్‌వర్క్ వ్యవస్థలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే వై-ఫై, WLAN రెండూ ఒకటే కావు. వై-ఫై అనేది వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ కోసం ఉపయోగించే సాంకేతికత కాగా, WLAN అనేది ఒక పరిమిత ప్రాంతంలో ఏర్పాటు చేసే వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను సూచిస్తుంది.

25
వై-ఫై అనే పేరు ఎందుకు పెట్టారు?

చాలామంది వై-ఫై అంటే 'Wireless Fidelity' అని భావిస్తారు. అయితే వాస్తవానికి Wi-Fi అనేది ఏ పదాలకూ సంక్షిప్త రూపం కాదు. ఇది సాంకేతికతకు గుర్తింపుగా పెట్టిన ఒక బ్రాండ్ పేరు. 1999లో వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో, సులభంగా గుర్తుపెట్టుకునే పేరును ఎంచుకున్నారు. అప్పట్లో IEEE 802.11 వంటి సాంకేతిక పేర్లను సాధారణ ప్రజలు గుర్తుంచుకోవడం కష్టంగా ఉండేది. అందుకే సులభంగా పలకడానికి, గుర్తుంచుకోవడానికి వీలుగా Wi-Fi అనే పేరును ఉపయోగించారు. ఈ పేరు అప్పటికే ప్రజలకు పరిచయమైన Hi-Fi (High Fidelity) అనే పదం నుంచి ప్రేరణ పొందింది. అయితే Wi-Fiకి అధికారికంగా 'Wireless Fidelity' అనే పూర్తి రూపం లేదు. ఈ పదాన్ని వై-ఫైకి అసలు అర్థంగా చెప్పడం సరైనది కాదు.

35
వై-ఫై ఎలా పనిచేస్తుంది?

వై-ఫై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే రూటర్ పాత్రను అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఇంటర్నెట్ కనెక్షన్ రూటర్‌కు అందుతుంది. ఆ రూటర్ రేడియో తరంగాల ద్వారా సమీపంలోని పరికరాలకు వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఉదాహరణకు, మీరు మొబైల్‌లో వై-ఫై ఆన్ చేసి ఇంటి నెట్‌వర్క్‌ను ఎంచుకుని పాస్‌వర్డ్ ఎంట‌ర్‌ చేస్తే, మీ ఫోన్ ఆ నెట్‌వర్క్‌కు లింక్ అవుతుంది. ఆ తర్వాత మీరు వెబ్‌సైట్లు చూడటం, వీడియోలు ప్లే చేయడం, సందేశాలు పంపడం వంటి పనులు చేయవచ్చు. మీ ఫోన్ పంపే సమాచారాన్ని రూటర్ ఇంటర్నెట్‌కు చేరవేస్తుంది. ఇంటర్నెట్ నుంచి వచ్చే సమాచారాన్ని తిరిగి మీ ఫోన్‌కు పంపిస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి మనం ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను ఉపయోగించగలుగుతాం. వై-ఫై సిగ్నల్ పరిధి రూటర్ సామర్థ్యం, గోడలు, ఇతర అడ్డంకులు, చుట్టుపక్కల ఉన్న నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల రూటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు సాధారణంగా మెరుగైన సిగ్నల్ లభిస్తుంది.

45
వై-ఫైని ఎవరు నిర్వహిస్తారు?

వై-ఫై అనేది ఒకే కంపెనీకి లేదా వ్యక్తికి చెందిన సాంకేతికత కాదు. దీని అభివృద్ధి, వినియోగంలో వివిధ సంస్థలు, సాంకేతిక కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి. Wi-Fi Alliance అనే సంస్థ వై-ఫై సాంకేతికతకు సంబంధించిన ధ్రువీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వై-ఫై పేరుతో విక్రయించే పరికరాలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడంలో ఈ సంస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరోవైపు, IEEE 802.11 అనే ప్రమాణాల సమూహం వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్‌ల సాంకేతిక నియమాలను నిర్దేశిస్తుంది. ఈ ప్రమాణాల ఆధారంగా వివిధ కంపెనీలు రూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలను తయారు చేస్తాయి. దీని వల్ల వివిధ కంపెనీలకు చెందిన పరికరాలు ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది.

55
వై-ఫై ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వై-ఫై ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, నెట్‌వర్క్‌కు సరైన భద్రత లేకపోతే వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వీక్‌ పాస్‌వర్డ్‌లు, పాత భద్రతా సెట్టింగ్‌లు, తెలియని పబ్లిక్ నెట్‌వర్క్‌లు సైబర్ ముప్పులకు కారణం కావచ్చు. వై-ఫై ఉపయోగించేటప్పుడు బలమైన పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి, పాస్‌వర్డ్‌ను అందరికీ చెప్పొద్దు, అలాగే రూట‌ర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవ‌డం వ‌ల్ల మీ డేటా భ‌ద్రంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories