SIM Binding Rules: కేంద్ర ప్రభుత్వం కొత్త సిమ్ బైండింగ్ నిబంధనలను తెస్తోంది. డిసెంబర్ 31 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జనవరి 1 నుంచి మార్పులు.. సిమ్ బైండింగ్ అంటే ఏమిటి?
మనం ప్రతిరోజు వాడే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో త్వరలోనే పెద్ద మార్పులు రాబోతున్నాయి. సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికాం శాఖ కొత్త సిమ్ బైండింగ్ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం, మనం డివైజ్‌లో వాడే యాప్ ఖాతా అనేది, ఆ ఫోన్లో ఉన్న కేవైసీ పూర్తయిన సిమ్ కార్డ్‌తో నేరుగా లింక్ అయి ఉండాలి.
ఇప్పటివరకు మనం ఫోన్లో ఓటీపీ ద్వారా ఒకసారి లాగిన్ అయితే సరిపోయేది. ఆ తర్వాత సిమ్ కార్డ్ తీసేసినా లేదా కేవలం వైఫై వాడినా వాట్సాప్ పనిచేసేది. కానీ ఇకపై అలా కుదరదు. మీరు ఏ నంబర్‌తో అయితే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వాడుతున్నారో, ఆ సిమ్ కార్డ్ కచ్చితంగా మీ ఫోన్లోనే యాక్టివ్‌గా ఉండాలి.
25
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఎవరిపై ప్రభావం పడుతుంది?
ఈ కొత్త సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేయడానికి టెలికాం శాఖ యాప్‌ల సంస్థలకు డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చింది. జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ, ప్లాట్‌ఫారమ్‌ల సన్నాహాలను బట్టి పూర్తిస్థాయి అమలు ఉంటుంది.
ఈ మార్పు వల్ల ముఖ్యంగా కొందరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫోన్ లో సిమ్ లేకుండా కేవలం వైఫై ద్వారా వాట్సాప్ వాడేవారు, విదేశాలకు ప్రయాణించేవారు, ఒకే నంబర్‌ను పలు డివైజ్‌లలో వాడేవారు, టాబ్లెట్లలో వైఫై ద్వారా మెసేజింగ్ యాప్‌లు ఉపయోగించేవారు లాగిన్ సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.
35
ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలాంటి మార్పులు రానున్నాయి?
సిమ్ బైండింగ్ నియమాలకు అనుగుణంగా టెక్ దిగ్గజాలు ఇప్పటికే మార్పులు చేయడం ప్రారంభించాయి. ఆపిల్ సంస్థ సెప్టెంబర్‌లోనే ఐఓఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చింది. ఫోన్లో సిమ్ ఉందో లేదో గుర్తించేందుకు ఈ అప్డేట్ ఉపయోగపడుతుంది.
మరోవైపు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై వాట్సాప్ కూడా ఈ సిమ్ బైండింగ్ ఫీచర్‌ను బీటా వర్షన్లో పరీక్షించడం ప్రారంభించింది. ఫోన్లో రిజిస్టర్డ్ సిమ్ లేకపోతే లేదా సిమ్ డిసేబుల్ అయితే యాప్ సేవలు నిలిచిపోయేలా యాప్‌లు తమ సెట్టింగ్స్‌ను మారుస్తున్నాయి.
గతంలో (నవంబర్ 28, 2025) ఇచ్చిన ఉత్తర్వుల్లో టెలికాం శాఖ ప్రతి ఆరు గంటలకు ఒకసారి వాట్సాప్ వెబ్ లాగౌట్ కావాలని ప్రతిపాదించింది. కానీ ఆ నిబంధనను సవరించింది. ఆటోమేటిక్ లాగౌట్ స్థానంలో కేవలం రిస్క్ ఆధారిత లాగౌట్లను ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం అనుమానాస్పద లేదా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదైనప్పుడు మాత్రమే ఖాతాలను వెంటనే నిలిపివేస్తారు. కాబట్టి వాట్సాప్ వెబ్ వాడుతున్న వారు ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు.
55
సైబర్ మోసాల అడ్డుకట్టకే ఈ నిర్ణయం
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, నకిలీ ప్రొఫైల్స్ ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది దేశంలో సైబర్ మోసాల వల్ల రూ. 22,800 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
ఫేక్ నంబర్లతో యాప్‌లు వాడటాన్ని అరికట్టడానికి టెలికాం శాఖ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా రూపొందిస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, షేర్‌చాట్, జోష్, జియోచాట్ వంటి యాప్‌లు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారం రూల్స్ పాటించని యాప్‌లపై కఠిన చర్యలు ఉంటాయి.