Micro beverages: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు చోట్ల మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ లైసెన్సులను జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వీటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్య రంగానికి కొత్త ఊపుని ఇచ్చే విధానాన్ని ప్రకటించింది. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలోనే వినియోగదారులకు తక్షణంగా తయారుచేసిన బీర్ అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ మైక్రో బ్రూవరీ యూనిట్లకు లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తేదీ వరకు గడువు ఉంది.
ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలోనే మైక్రో బ్రూవరీలకు అనుమతి ఉండగా, ప్రస్తుతం 18 యూనిట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఈ సదుపాయాన్ని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకూ విస్తరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ వంటి పట్టణాల్లో కూడా మైక్రో బ్రూవరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
35
స్థలం, అర్హతలు, ఫీజు వివరాలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం, మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేయాలనుకునే వారికి కనీసం 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో స్థలం కావాల్సి ఉంటుంది. ఈ యూనిట్లు హోటళ్లు, రెస్టారెంట్లు, 2బీ బార్లు, ఎలైట్ బార్లు, సీ1 క్లబ్బులు, టీడీ1, టీడీ2 లైసెన్స్ కలిగిన ప్రాంగణాల్లో మాత్రమే అనుమతిస్తారు. దరఖాస్తుదారులు రూ.1 లక్ష నాన్-రిఫండబుల్ ఫీజుతో అప్లికేషన్ సమర్పించాలి. ఎక్సైజ్ శాఖ స్పష్టంగా తెలిపినట్టుగా, నిబంధనలు పాటించేంత వరకు దరఖాస్తుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు.
* టీసీయూఆర్ పరిధిలో (బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదీగూడ, నిజాంపేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు) దరఖాస్తులు నేరుగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి.
* మిగిలిన కార్పొరేషన్లకు సంబంధించి ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకే దరఖాస్తులు ఇవ్వాలి.
మరిన్ని వివరాల కోసం tgbcl.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా సమాచారం పొందవచ్చు.
55
దీంతో లాభాలు ఏంటి.?
మైక్రో బ్రూవరీ విధానం ద్వారా ఆతిథ్య రంగానికి కొత్త ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. క్రాఫ్ట్ బీర్‌పై పెరుగుతున్న డిమాండ్ తీరుతుంది. స్థానిక యువతకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటకులకు ఆకర్షణీయమైన సదుపాయం లభిస్తుంది. పట్టణ జీవనశైలి మరింత మెరుగుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుంది.