
ప్రస్తుత టెక్ జమానాలో మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది భాగమైపోయింది. ఫ్యామిలీ, వ్యక్తిగత ఫోటోలో, వీడియోల నుండి బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ వరకు ప్రతిదీ అందులోనే ఉంటాయి... చాలామంది కీలకమైన బిజినెస్, ఇతర సమాచారాన్ని కూడా ఫోన్ లో సేవ్ చేసుకుంటారు. అలాంటిది ఫోన్ ఎక్కడైనా మిస్ అయితే... ఎవరైనా చోరీచేస్తే? ఇది ఊహించడానికే ఆందోళనకరంగా ఉంది. అయితే సెల్ ఫోన్ పోతే మన ఢాటా, ఇతర సమాచారాన్ని ఎలా సేఫ్ గా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
మీ ఫోన్‌ని ట్రాక్ చేస్తామని చాలా థర్డ్ పార్టీ యాప్స్ చెప్తాయి... కానీ అవి ఎంతవరకు నమ్మదగ్గవో తెలియదు. మరి నమ్మకమైన, సురక్షితమైన మార్గం ఏదంటే ఫోన్ లో కేంద్ర ప్రభుత్వ అధికారిక CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ని ఉపయోగించడమే. IMEI నెంబర్‌తో పోయిన ఫోన్‌ని CEIR పోర్టల్ ద్వారా ఎలా కనిపెట్టాలి, బ్లాక్ చేయాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే.
ఐఎంఈఐ (International Mobile Equipment Identity) అనేది ప్రతి మొబైల్‌కీ ఉండే ప్రత్యేకమైన 15 అంకెల నెంబర్. ఇది మీ ఫోన్ డిజిటల్ ఫింగర్‌ప్రింట్ లాంటిది. ఏ సిమ్ వాడినా ఈ నెంబర్ మారదు కాబట్టి దొంగిలించబడిన ఫోన్లను బ్లాక్ చేయడానికి, కనిపెట్టడానికి ఇది చాలా ముఖ్యమైనది. మీ ఫోన్ IMEI నెంబర్‌ని మీరు కొన్న బాక్స్ మీద లేదా బిల్లు మీద చూడొచ్చు. లేదా మీ ఫోన్ నుండి *#06# డయల్ చేసినా ఆ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ నెంబర్‌ని సురక్షితంగా ఎక్కడైనా రాసుకొని ఉంచుకోవడం మంచిది.
మీ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, ముందుగా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ (FIR) చేయాలి. ఇది చట్టపరమైన చర్య మాత్రమే కాద తర్వాత జరిగే ప్రక్రియలకు కూడా ఇది చాలా ముఖ్యం. కొన్ని రాష్ట్రాల్లో ఫోన్ పోతే ఆన్‌లైన్‌లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఫోన్ మోడల్, బ్రాండ్, ముఖ్యంగా IMEI నెంబర్ వంటి అన్ని వివరాలను కరెక్ట్‌గా ఇవ్వాలి. తర్వాతి స్టెప్‌కి వెళ్లడానికి ఈ పోలీస్ కంప్లైంట్ కాపీ లేదా ఎఫ్ఐఆర్ నెంబర్ అవసరం.
ఐఎంఈఐ నెంబర్ బ్లాక్ చేసే ప్రక్రియ మొదలుపెట్టడానికి ముందు, పోయిన ఫోన్ నెంబర్‌కి కొత్త సిమ్ (డూప్లికేట్ సిమ్) తీసుకోవాలి. CEIR పోర్టల్ వెరిఫికేషన్ కోసం ఈ కొత్త నెంబర్‌కే ఓటిపి వస్తుంది. అలాగే మీ ఐడెంటిటీ కార్డ్ (ఆధార్ కార్డ్ లాంటివి), ఫోన్ కొన్న బిల్లు వంటివి డిజిటల్ కాపీలుగా ఉంచుకోవాలి.
టెలికాం శాఖ (DoT) ప్రాజెక్ట్ అయిన సిఈఐఆర్ (Central Equipment Identity Register) దొంగిలించబడిన, నకిలీ ఫోన్లు వాడకుండా ఆపడానికి ఉద్దేశించబడింది. ఈ పోర్టల్ ద్వారా దొంగిలించబడిన ఫోన్ ఐఎంఆఐ నెంబర్‌ని బ్లాక్ చేయొచ్చు. దీంతో ఆ ఫోన్ ఇండియాలో ఏ నెట్‌వర్క్‌లోనూ పనిచేయదు.
1. అధికారిక సంచార్ సాథీ పోర్టల్‌కి వెళ్లండి: sancharsaathi.gov.in.
2. "Block Your Lost/Stolen Mobile" (మీ పోయిన/దొంగిలించబడిన మొబైల్‌ని బ్లాక్ చేయండి) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని సిఈఐఆర్ పోర్టల్‌కి తీసుకెళ్తుంది.
3. పోయిన ఫోన్ నెంబర్, కొత్త ఫోన్ నెంబర్ (డూప్లికేట్ సిమ్), ఫోన్ ఐఎంఈఐ నెంబర్, పోలీసుల దగ్గర తీసుకున్న ఎఫ్ఐఆర్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి.
4. ఈ ఎఫ్ఐఆర్, ఐడెంటిటీ కార్డ్ డిజిటల్ కాపీలు అప్‌లోడ్ చేయాలి.
5. ఇలా పూర్తి వివరాలతో ఫిల్ చేసిన ఫారమ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిక్వెస్ట్ ఐడి వస్తుంది. తర్వాత మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి దీన్ని రాసుకొని ఉంచుకోండి.
6. మీ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయి వెరిఫై అయిన తర్వాత, 24 గంటల్లో మీ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తుంది. దీంతో వేరే సిమ్ వాడినా, ఆ ఫోన్‌ని ఎవరూ కాల్స్, SMS లేదా మొబైల్ డేటా కోసం వాడలేరు.
CEIR ప్రధానంగా ఫోన్‌ని బ్లాక్ చేసే వ్యవస్థ అయినప్పటికీ, అది ఫోన్‌ని కనిపెట్టడానికీ ఉపయోగపడుతుంది. బ్లాక్ చేయబడిన ఫోన్ ఆన్ చేసి, ఏదైనా నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయితే ఆ వ్యవస్థ దాని లొకేషన్‌ని కనిపెడుతుంది. పోలీసులు ఆ ఫోన్‌ని వెతుకుతున్నప్పుడు ఈ సమాచారం ఉపయోగించి దాన్ని తిరిగి పొందొచ్చు.
మీ రిక్వెస్ట్ స్టేటస్‌ని సిఈఐఆర్ పోర్టల్‌లో మీ రిక్వెస్ట్ ఐడితో చెక్ చేసుకోవచ్చు. ఈ అధికారిక పద్ధతిని ఉపయోగించడం ద్వారా మీ పర్సనల్ డేటాను సురక్షితంగా ఉంచుకోవడమే కాకుండా, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నారు. వెరిఫై కాని థర్డ్ పార్టీ యాప్స్‌ని నమ్మకూడదు, ఎందుకంటే అవి మోసపూరితంగా ఉండి, మీ డేటా సురక్షితత్వాన్ని దెబ్బతీయవచ్చు.