ఇక‌పై గూగుల్ మ్యాప్స్‌లోనే బ‌స్ టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే.?

Published : Nov 08, 2025, 09:52 AM IST

Google Maps: మ‌నం వెళ్లే ప్ర‌దేశానికి సంబంధించిన రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్‌ని ఉప‌యోగిస్తామ‌ని తెలిసిందే. అయితే ఇప్పుడు మ్యాప్స్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్ వ‌చ్చేసింది. ఇక‌పై గూగుల్ మ్యాప్స్‌లోనే బ‌స్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. అదెలాగంటే.. 

PREV
15
గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌

ఇప్పటి వరకు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా మనం ప్రయాణ రూట్‌ మాత్రమే చూసుకునేవాళ్లం. కానీ ఇకపై అదే మ్యాప్స్‌లోంచి ఆర్టీసీ బస్సుల టికెట్‌ కూడా బుక్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఈ కొత్త సదుపాయం కోసం గూగుల్‌తో కలిసి పనిచేసింది. ఇప్పటికే ఆర్టీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, ఏజెంట్లు, బస్టాండ్‌ కౌంటర్ల ద్వారా రిజర్వేషన్‌ చేసే అవకాశం ఉన్నా.. అద‌నంగా గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవ‌చ్చు.

25
గూగుల్‌ మ్యాప్స్‌ ఎలా పనిచేస్తుంది?

గూగుల్‌ మ్యాప్స్‌లో మీరు “విజయవాడ నుంచి హైదరాబాద్” లేదా “విశాఖపట్నం నుంచి తిరుపతి” అని టైప్‌ చేస్తే, సాధారణంగా రహదారి దూరం, ప్రయాణ సమయం, వాహన మార్గాలు కనిపిస్తాయి. ఈ వివరాలు జెనరల్‌ ట్రాన్సిట్‌ ఫీడ్‌ స్పెసిఫికేషన్‌ (GTFS) ఆధారంగా ఉంటాయి. ఇప్పుడు అదే స్క్రీన్‌లో బస్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే, ఆ మార్గంలో నడిచే అన్ని ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల సమాచారం చూపిస్తుంది. ఏ బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది, ఎన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది వంటి వివరాలు అందుబాటులోకి వస్తాయి. మీకు కావాల్సిన‌ బస్సును ఎంచుకొని క్లిక్‌ చేస్తే నేరుగా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ టికెట్‌ రిజర్వేషన్‌ పూర్తి చేసి, ఆన్‌లైన్‌ ద్వారా డ‌బ్బులు చెల్లించవచ్చు.

35
విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో ట్రయల్‌ సక్సెస్‌

గూగుల్‌, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు కలిసి ఈ ఫీచర్‌ను మొదట ప్రయోగాత్మకంగా విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో ప్రారంభించారు. కొద్ది రోజులపాటు పరీక్షించిన తర్వాత బుకింగ్స్‌ విజయవంతంగా జరిగాయి. ప్రయాణికుల స్పందన సానుకూలంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ను ఇతర రూట్లకు కూడా విస్తరించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

45
గూగుల్‌ ఆమోదం, డేటా షేరింగ్‌

ఏపీఎస్‌ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న అన్ని ఏసీ, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సుల వివరాలు, వాటి రూట్లు, బస్టాప్‌ లొకేషన్లు, లాటిట్యూడ్‌, లాంగిట్యూడ్‌ డేటా గూగుల్‌కు అందజేశారు. గూగుల్‌ ఆ వివరాలను పరిశీలించి ఆడిట్‌ టెస్టులు నిర్వహించింది. మూడు రోజుల క్రితం ఈ వ్యవస్థకు తుది ఆమోదం ఇచ్చింది.

55
త్వరలో అన్ని రూట్లలో బుకింగ్‌ సదుపాయం

ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌ విజయవంతంగా నడుస్తుండగా, వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రూట్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూట్‌ సెర్చ్‌ చేసినా, అందులో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్‌ బస్సులు కనిపిస్తాయి. అంటే ఇక బస్టాండ్‌ లేదా యాప్‌ ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేదు నేరుగా మ్యాప్స్‌ ద్వారానే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చన్న‌మాట‌.

Read more Photos on
click me!

Recommended Stories