
Arattai : స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై' పని అయిపోయినట్లే కనిపిస్తోంది. అమెరికన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీగా ఇండియన్ టెక్ దిగ్గజం జోహో ఈ అరట్టైని తీసుకువచ్చింది. ఇటీవల ఒక్కసారిగా ఊపందుకున్న అరట్టై ఇప్పుడు తిరిగి ప్రజాదరణ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 100 యాప్స్ జాబితాలో ఈ ఇండియన్ యాప్ చోటు కోల్పోయింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో దీని స్థానం దిగజారడం అరట్టై తాజా పరిస్థితిని తెలియజేస్తుంది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు అందులో తప్పకుండా వాట్సాప్ ఉండితీరుతుంది. చాటింగ్, ఆన్లైన్ కాలింగ్, వీడియో కాలింగ్ తో పాటు అనేక సదుపాయాలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అందుకే ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువయ్యింది. ఇలాంటి విదేశీ యాప్ కు పోటీగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ వెంబు అరట్టై యాప్ ను తీసుకువచ్చారు.
భారతదేశంలో ఈ అరట్టై యాప్ 2021 లో లాంచ్ చేసింది జోహో... చాలా తక్కువ కాలంలో ఇది వాట్సాప్ కు పోటీనిస్తుందనే స్థాయికి చేరుకుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాలపై ఎక్కువగా ఆదారపడకూడదని... అందుకోసమే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ప్రధాని చేసిన ప్రచారం అరట్టైకి బాగా కలిసివచ్చింది... చాలా తక్కువ సమయంలో అత్యధికమంది డౌన్లోడ్ చేసుకున్నారు.
కేవలం గూగుల్ ప్లే స్టోర్ లోనే ఈ అరట్టై యాప్ డౌన్లోడ్స్ కోటి దాటాయి. గత సెప్టెంబర్ లో అయితే అరట్టై డౌన్లోడ్ రికార్డులు సృష్టించాయి.. ఆండ్రాయిడ్ లోనే కాదు ఐవోఎస్ లో కూడా అత్యధిక డౌన్లోడ్స్ నమోదయ్యాయి. దీంతో గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ ప్రీ యాప్స్ లిస్ట్ లో 4.8 రేటింగ్ తో అరట్టై టాప్ లో నిలిచింది… యాపిల్ స్టోర్ లోనూ అగ్రస్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్ గ్లోబల్ మార్కెట్ ను ఆక్రమించాయి. దశాబ్దకాలంగా ఉచితంగానే వివిధ రకాల సేవలందిస్తున్నాయి... దీంతో ప్రజలకు చాలా దగ్గరయ్యాయి. ఇలాంటివాటితో పోటీ చాలా కష్టమే... వీటికి అలవాటుపడ్డవారిని ఆకర్షించడం అరట్టై వంటి కొత్త మెసేజింగ్ యాప్స్ కు సవాలే. అయితే ఈ స్వదేశీ మెసేజింగ్ యాప్ ని లాంగ్ టర్మ్ విజన్ తో తీసుకువచ్చామని... అందుకే వచ్చిరాగానే అద్భుతాలు చేస్తుందని అనుకోవడంలేదని జోహో చెబుతోంది.
అరట్టైని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని జోహో స్పష్టం చేస్తోంది. దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఈ మేసేజింగ్ యాప్ కు ప్రజాధరణ కూడా మెల్లిగా పెరుగుతోందని అంటున్నారు. వెంటనే కాకున్నా భవిష్యత్ లో అరట్టై ఇండియాలో టాప్ మెసేజింగ్ యాప్ గా మారుతుందని జోహో ధీమా వ్యక్తం చేస్తోంది. తాము లాంగ్ విజన్ తో దీన్ని రూపొందించినట్లు జోహో ఇప్పటికే తెలిపింది.
అరట్టై అనేది తమిళ పదం. దీని అర్ధం 'చాటింగ్' లేదా 'చిట్ చాట్'. తమిళనాడు రాజధాని చైన్నై ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగించే టెక్ దిగ్గజం జోహో దీన్ని రూపొందించింది. దీన్ని చాలా తక్కువ సమయంలో అత్యధికమంది డౌన్లోడ్ చేసుకున్నారు. పలువరు కేంద్ర మంత్రులు కూడా ఈ స్వదేశీ మెసేజింగ్ యాప్ ను వాడాలని కోరుతున్నారు... కొందరయితే స్వయంగా డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు.