టోక్యో ఒలింపిక్స్: సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు... కాంస్య పతక పోరుకు...

First Published | Aug 3, 2021, 8:44 AM IST

41 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మెన్స్ హాకీ టీం 2-5 తేడాతో పోరాడి ఓడింది.

ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే గోల్ చేసిన లోక్ లూపార్ట్, బెల్జియంకు 1-0 తేడాతో ఆధిక్యం అందించాడు. అయితే ఏడో నిమిషంలో గోల్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్ 1-1 తేడాతో స్కోర్లను సమం చేయగలిగాడు.

తొలి గోల్ చేసిన తర్వాతి నిమిషంలోనే మన్‌దీప్ సింగ్ గోల్ చేయడంతో 1-2 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. తొలి క్వార్టర్‌లో ఆధిక్యంలో నిలిచింది భారత జట్టు. 

Latest Videos


అయితే రెండో క్వార్టర్స్‌లో 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన అలెగ్జాండర్ హెండ్రిక్స్ స్కోర్లను 2-2 తేడాతో స్కోర్లను సమం చేశాడు. 

మూడో క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. నాలుగో క్వార్టర్ 49వ నిమిషంలో మూడు పెనాల్టీ కార్నర్స్ లభించగా, మూడో ప్రయత్నంలో అలెగ్జాండర్ హెండ్రిక్స్ గోల్ సాధించి... ఆధిక్యంలోకి వెళ్లింది బెల్జియం...

ఆట 53వ నిమిషంలో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్స్ దక్కించుకున్న బెల్జియం, ఆ తర్వాత వచ్చిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచిన హెండ్రిక్స్‌, బెల్జియంకు 4-2 లీడ్ అందించాడు.   

బెల్జియం అటాకింగ్‌ను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన టీమిండియా, అనవసర తప్పిదాలు చేసి ప్రత్యర్థికి వరుసగా పెనాల్టీ కార్నర్స్ అందించింది. బెల్జియం సాధించిన గోల్స్ అన్నీ పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చినవే కావడం విశేషం. 

అటాకింగ్ ప్లే చేసేందుకు గోల్ కీపర్‌ను విత్‌డ్రా చేసుకున్న టీమిండియా, మ్యాచ్ ఆఖరి నిమిషంలో గోల్ అప్పగించింది. దీంతో 5-2 తేడాతో ఓడింది భారత జట్టు.

అంతకుముందు మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ అన్నూ రాణి నిరాశపరిచింది. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 60 మీటర్ల దూరం విసరాల్సిన దశలో అన్నూ రాణి అత్యుత్తమంగా 54.04 మీటర్లు మాత్రమే విసిరి 14వ స్థానంలో నిలిచింది.  

click me!