ప్రముఖ స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ గా పేరుగాంచిన ద్యుతీ చంద్ తాను స్పోర్ట్స్ హాస్టల్ లో ఎదుర్కున్న కష్టాల గురించి తాజాగా సంచలన నిజాలు బయటపెట్టింది. భువనేశ్వర్ లోని హాస్టల్ లో గడిపిన రెండేండ్లలో తానూ ర్యాగింగ్ బాధితురాలినేనని పేర్కొంది.
ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో రెండ్రోజుల క్రితం స్పోర్ట్స్ హాస్టల్ లో ఉంటున్న రుచిక అనే డిగ్రీ చదువుకునే అమ్మాయి.. సీనియర్లు చేసే ర్యాగింగ్ కు తాళలేక ఆత్మహత్య చేసుకున్నది.
రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ లోనే ద్యుతీ కూడా ఉండేది. రుచిక ఆత్మహత్య నేపథ్యంలో ద్యుతీ.. తాను హాస్టల్ లో ఎదుర్కున్న కష్టాలను సోష్ మీడియా వేదికగా వెల్లడించింది. 2006 నుంచి 2008 వరకు ఈ హాస్టల్ లోనే గడిపింది ద్యుతీ.
ద్యుతీ స్పందిస్తూ.. ‘సీనియర్లు వాళ్ల రూమ్స్ కు నన్ను పిలిపించుకుని వాళ్ల బాడీ మసాజ్ చేయమని అడడిగేవారు.. వాళ్లు వేసుకున్న బట్టలు నన్ను ఉతకమనేవాళ్లు. ఒకవేళ నేను వాళ్ల పనులకు ఎదురుచెబితే టార్చర్ పెట్టేవాళ్లు.
సీనియర్ల విషయం హాస్టల్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ ఉపయోగం లేకపోయేది. వాళ్లు పట్టించుకునేవాళ్లే కాదు. నన్ను తిట్టేవాళ్లు. అదీగాక నా పేదరికాన్ని చూపి నానా మాటలనేవాళ్లు. దాంతో నేను చాలా విసిగిపోయా...’ అని ద్యుతీ తెలిపింది.
క్రీడాకారులకు ఇలాంటి ఘటనల వల్ల చాలా డిస్ట్రబ్డ్ అవుతారని.. దాంతో ఆట మీద దృష్టి సారించడం కష్టమని తెలిపింది. ‘హాస్టల్ లో ఉన్నప్పుడు జరిగిన ఆ ఘటనలు నా మీద తీవ్ర ప్రభావం చూపాయి. అది నా మానసిక స్థితి ని చాలా ప్రభావితం చేసింది. ఇలాంటప్పుడు ఆట మీద దృష్టి సారించడం చాలా కష్టం’ అని ద్యుతీ ఆవేదన వ్యక్తం చేసింది.