Sarfaraz Khan : 9 సిక్సర్లు, 19 ఫోర్లతో సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం.. హైదరాబాద్‌పై డబుల్ సెంచరీ!

Published : Jan 23, 2026, 04:05 PM IST

Sarfaraz Khan: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌పై 227 పరుగులతో చెలరేగాడు. 19 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడి తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 5వ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

PREV
16
Sarfaraz Khan: ముంబై డాన్ ఈజ్ బ్యాక్.. 227 పరుగులతో విధ్వంసం

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉంటే, మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారుతోంది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో దశ మ్యాచ్‌లలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సంచలనం సృష్టించాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన కసితో ఉన్నాడో ఏమో గానీ, సర్ఫరాజ్ తన బ్యాట్‌కు పని చెప్పాడు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున ఆడుతూ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడుతూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు.

26
హైదరాబాద్ బౌలర్లపై సర్ఫరాజ్ ప్రతాపం

టీమిండియాకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. మొదట సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటాడు, ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు రాబట్టాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీ 2025-26 రెండో దశ తొలి మ్యాచ్‌లోనే తన విశ్వరూపం చూపించాడు.

హైదరాబాద్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ కేవలం 219 బంతుల్లోనే 227 పరుగులు సాధించాడు. ఇందులో 19 అద్భుతమైన ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. టెస్టు ఫార్మాట్‌ అయినప్పటికీ సర్ఫరాజ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. సర్ఫరాజ్ విధ్వంసంతో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500కు పైగా పరుగులు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 8 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది.

36
కష్టకాలంలో ఆదుకున్న సర్ఫరాజ్ వీరోచిత ఇన్నింగ్స్

ఈ డబుల్ సెంచరీ కేవలం పరుగుల పరంగానే కాదు, సందర్భం పరంగా కూడా ఎంతో విలువైనది. ముంబై జట్టు కేవలం 82 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. అజింక్య రహానే, పృథ్వీ షా వంటి స్టార్ల గైర్హాజరీలో, జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత మిడిల్ ఆర్డర్‌పై పడింది.

ఈ సమయంలో 5వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, కెప్టెన్ సిద్దేశ్ లాడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 328 బంతుల్లో 249 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో పాతుకుపోయిన సర్ఫరాజ్ 206 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

46
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 5వ డబుల్ సెంచరీ కొట్టిన సర్ఫరాజ్ ఖాన్

మరోవైపు సిద్దేశ్ లాడ్ కూడా అద్భుతంగా రాణించి 179 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. లాడ్ అవుటైన తర్వాత సర్ఫరాజ్ తన దూకుడును మరింత పెంచాడు. సెంచరీ తర్వాత గేర్ మార్చిన సర్ఫరాజ్, డబుల్ సెంచరీ దిశగా వేగంగా కదిలాడు.

చివరకు 227 పరుగుల వద్ద సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇది ఐదవ డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. నిలకడలేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న సర్ఫరాజ్, ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.

56
సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్

గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియా సెలెక్టర్లు పక్కన పెడుతున్నారు. 2024 తర్వాత అతను భారత టెస్టు జట్టులో కనిపించలేదు. దాదాపు ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో వరుసగా రాణిస్తుండటంతో అతని పునరాగమన అవకాశాలు మెరుగుపడ్డాయి.

సర్ఫరాజ్ ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్‌లలో 37.1 సగటుతో 495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 150 పరుగులు. ఇప్పుడు రంజీల్లో డబుల్ సెంచరీతో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

66
ఐపీఎల్ 2026లో చెన్నై తరఫున సందడి చేయనున్న సర్ఫరాజ్ ఖాన్

సర్ఫరాజ్ ఖాన్ కేవలం రెడ్ బాల్ క్రికెట్‌కే పరిమితం కాదు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన సర్ఫరాజ్, ఆ తర్వాత జరిగిన వేలంలో జాక్‌పాట్ కొట్టాడు.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ అతన్ని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. వేలం చివరి రౌండ్‌లో సీఎస్కే సర్ఫరాజ్‌పై నమ్మకం ఉంచి సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీలో ప్రదర్శిస్తున్న ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తే, సర్ఫరాజ్ కెరీర్ మరో మలుపు తిరగడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories