
భారత బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ జోడీ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్. అయితే, క్రీడా ప్రపంచానికి షాక్ ఇస్తూ జూలై 16న ఈ జోడీ విడాకుల ప్రకటన చేసింది.
అయితే, తాజాగా సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ దంపతులు విడాకుల విషయంపై వెనక్కి తగ్గారు. మళ్లీ కలసి జీవితం సాగించాలనే నిర్ణయం తీసుకున్నారు.
2018 డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. దాదాపు పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే, ఇటీవలే వీరిద్దరూ విడిపోతున్నామని ప్రకటించడంతో, అభిమానులు షాక్ అయ్యారు. కానీ, మూడు వారాలకే మళ్లీ కలవాలని నిర్ణయించుకోవడంతొ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 2న సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పారుపల్లి కశ్యప్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోకు ఆమె రాసిన క్యాప్షన్.. “కొన్నిసార్లు దూరం మనిషి విలువను నేర్పిస్తుంది. మేము మళ్లీ ప్రయత్నిస్తున్నాం” అంటూ భావోద్వేగ నోట్ పంచుకున్నారు.
ఈ కోట్ వారి మధ్య ఉన్న బంధాన్ని మాత్రమే కాదు, విడిపోతున్న జంటలందరికీ ఓ ప్రేరణగా నిలుస్తోంది. కొంతకాలం వేరుగా ఉండటం వాళ్లకు ఒకరినొకరు ఎంత అవసరమో గుర్తు చేసింది.
సైనా నెహ్వాల్ జూలై 16న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. "ప్రపంచంలో జీవితం ఒక్కొక్కసారి మమ్మల్ని వేరే దిశల్లోకి తీసుకుపోతుంది. ఎంతో ఆలోచించి, మేమిద్దరం శాంతి, అభివృద్ధి, వైవిధ్యం కోరుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని పేర్కొన్నారు.
ఆమె మాటలు అభిమానులకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించాయి. “ఇప్పుడు ఉన్న జ్ఞాపకాలకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మా నిర్ణయానికి గౌరవం ఇవ్వండి” అని ఆమె పేర్కొన్నారు.
సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తొలి భారత మహిళా షట్లర్. ఆమె BWF వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ గెలిచిన మొదటి భారత క్రీడాకారిణి. 2015లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ అందుకున్నారు.
కశ్యప్ పారుపల్లి 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచారు. 2012 ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్ దాకా చేరిన ఆటగాడు. ప్రస్తుతం తన అకాడమీలో కోచ్‌గా మారారు.
సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ప్రేమకథ 2005లో బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరంలో మొదలైంది. అప్పటి నుండి వారిద్దరూ టోర్నమెంట్‌లకు కలిసి వెళ్లి, కలిసి శిక్షణ తీసుకుని ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తమ వ్యక్తిగత సంబంధాన్ని ప్రేమగా పెంచుకున్నారు.
2018 డిసెంబర్ 16న సైనా తన వివాహ ఫోటోను పోస్ట్ చేస్తూ, “ఇది నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్” అని పేర్కొంది. విడాకుల నిర్ణయం తర్వాత ఇప్పుడు మళ్లీ కలసి, బంధాన్ని కొనసాగించాలనే వారి నిర్ణయం, ప్రేమలో ఉన్న వారందరికీ ఒక పాఠంగా నిలుస్తోంది. బంధాలు సవాళ్లను ఎదుర్కొంటాయి, కానీ నిజమైన ప్రేమ తిరిగి కలుస్తుందని అని సోషల్ మీడియాలో వీరి నిర్ణయం పై కామెంట్స్ చేస్తున్నారు.