వీళ్లేం మారలేదు భయ్యా... సింధు కులం గురించి, లవ్‌లీనా మతం కోసం వెతుకులాట...

First Published | Aug 2, 2021, 3:41 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒక్కో విజయం కోసం అద్భుతంగా పోరాడుతున్నారు. దేశ గౌరవం నిలబెట్టడం కోసం, ఒక్క పతకం సాధించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన చాలా మెరుగైంది. 

టేబుల్ టెన్నిస్‌లో భారత ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్స్‌ దాకా వెళ్లగా, ఫెన్సింగ్‌, స్విమ్మింగ్, డిస్క్ త్రో వంటి ఈవెంట్లలోనూ మంచి ఫలితాలు దక్కాయి...

1980 తర్వాత తొలిసారిగా భారత హాకీ జట్లు అద్వితీయ ఆటతీరుతో సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి. 

Latest Videos


వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాయి ఛాను, రజత పతకం సాధించగా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. బాక్సర్ లవ్‌లీనా బోర్గోహైన్ సెమీస్‌లో ప్రవేశించడంతో మరో పతకం ఖాయమైంది. 

టోక్యోలో కాకపోయినా భవిష్యత్తులో భారత్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఉండి, సోషల్ మీడియాలో సోది కబుర్లు చెప్పుకునే జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 

pv sindhu

భారత్‌కి ఎవరు పతకాలు తీసుకొచ్చినా, వారి కులం గురించి, మతం గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట భారతీయులు. ఆగస్టు 1న పీవీ సింధు కాంస్యం గెలిచిన తర్వాత ‘పీవీ సింధు కులం ఏంటి?’ అంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేశాడట మనవాళ్లు. 

జూలై 30న వుమెన్స్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్ ముగిసిన తర్వాత లవ్‌లీనా బోర్గోహైన్ ఏ మతానికి చెందినదంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారంట... ఈ పిచ్చి ఏ స్థాయికి చేరిదంటే పీవీ సింధు ఒలింపిక్ పతకం గెలిచిందని కాకుండా, ఫలానా కులానికి చెందిన అమ్మాయి ఒలింపిక్ మెడల్ సాధించిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంతగా...

తినడానికి సరైన తిండి లేక, ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకుండా జీవితంలో దేశం కోసం ఏదైనా సాధించాలనే తపనతో, మొండి పట్టుదలతో పోరాడి, అనేక కష్టాలను అధిగమించి అత్యున్నత వేదికపై విజయం సాధిస్తే... వారి కష్టానికి కాకుండా కులానికి, మతానికి గుర్తింపు ఇస్తున్నారు.

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాభాయి ఛాను, ఓ చిన్న గదిలో ఉంటుంది. వాళ్లింట్లో కూర్చోవడానికి కూర్చీలు కూడా లేవు. ఆర్చర్ ప్రవీణ్ జాదవ్, ఓ పూరీ గుడిసెలో ఉంటాడు. భారత అథ్లెట్లు పీ రేవతి, నాగానందం ఎన్నో ఆర్థిక కష్టాలను అధిగమించి ఒలింపిక్స్ దాకా వచ్చారు.

ఇలా వారి కష్టాల గురించి, సక్సెస్‌కి ముందు చేసిన స్ట్రగుల్ గురించి కాకుండా... కాకుండా కులాల గురించి, మతాల గురించి వెతికే వారిలో యువకులే ఎక్కువ ఉండడం, భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందో అద్ధం పడుతోంది.

స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా, చైనాలాంటి దేశాలు ఒలింపిక్స్‌లో పతకాల పంట పడిస్తున్నా... చేతకాక, చావలేక, ఒక్క పతకం వస్తే చాలని, ఆతృతగా ఎదురుచూసే దేశం మనది... 


ఇలా కులాల గురించి, మతాల గురించి వెతికే జనాలు ఉన్నంతవరకూ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులే వచ్చినా మార్పు రాదంటున్నారు కొందరు నెటిజన్లు...

21వ శతాబ్దంలో కూడా పేరు చివర కులాన్ని, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కులానికి సంబంధించిన గ్రూప్‌ని చేర్చుకునే నేటితరం... ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తారని ప్రశ్నిస్తున్నారు మరికొందరు... 

click me!