
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), విరాట్ కోహ్లీ అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. బెంగళూరులోని ఐకానిక్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.
ఈ నిర్ణయం ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కి ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు జారీ చేయడంతో, గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో చిన్నస్వామి స్టేడియం చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి ముగింపు పలికింది. సరిగ్గా 2025 జూన్ 4న ఈ మైదానంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ట్రోఫీ గెలిచిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, డజన్ల కొద్దీ గాయపడటం క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన తర్వాత స్టేడియంలో క్రికెట్ కార్యకలాపాలపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ విషాదం కారణంగానే జూన్ నుంచి ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియం ఎటువంటి క్రికెట్ సందడి లేకుండా మూగబోయింది.
గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన అనేక ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇందులో దులీప్ ట్రోఫీ, ఇండియా-దక్షిణాఫ్రికా పురుషుల ఏ సిరీస్, విజయ్ హజారే ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీలు ఉన్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా, 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్, అందులోనూ ఫైనల్ మ్యాచ్‌ను కూడా బెంగళూరు నుంచి తరలించడం ఇక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, తాజా అనుమతులతో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ కళ బెంగళూరుకు తిరిగి రానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి ఇది కేవలం లాజిస్టికల్ విజయం మాత్రమే కాదు, మానసిక బలం కూడా. తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడలేకపోతామేమోనని ఆర్సీబీ యాజమాన్యం, అభిమానులు ఇన్నాళ్లు ఆందోళన చెందారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందు, రాయ్‌పూర్ లేదా పూణే వంటి తటస్థ గ్రౌండ్ లకు ఆర్సీబీ హోమ్ మ్యాచ్‌లను మార్చడంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇప్పుడు అనుమతి లభించడంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ తమ సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఈ విషయమై స్పందిస్తూ, "కర్ణాటక ప్రభుత్వ హోం శాఖ చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది" అని తెలిపారు. అయితే, ఈ అనుమతి కొన్ని షరతులకు లోబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు సూచించిన నిర్దిష్ట నిబంధనలను పాటించాల్సి ఉంటుందని, కేఎస్సీఏ ఆయా షరతులన్నింటినీ నెరవేరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మాజీ భారత పేసర్ వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని కొత్త అసోసియేషన్ నాయకత్వం, గత నెల రోజులుగా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలతో చర్చలు జరుపుతూ, క్రికెట్‌ను తిరిగి ఇదే గ్రౌండ్ కు తీసుకురావడానికి కృషి చేసింది. నిపుణుల సమీక్షా కమిటీ ముందు తాము సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను సమర్పించామనీ, భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని మృత్యుంజయ వెల్లడించారు.
ప్రభుత్వ అనుమతి లభించినప్పటికీ, ఆర్సీబీ తమ ఐపీఎల్ 2026 హోమ్ మ్యాచ్‌లన్నింటినీ చిన్నస్వామిలోనే ఆడుతుందా లేదా అనేది ఇంకా ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే, అనుమతి రావడానికి ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మీనన్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్‌ని కలిశారు.
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు నిర్వహించేలా చర్చలు జరిపారు. ఇప్పుడు సొంతగడ్డపై అనుమతి వచ్చిన నేపథ్యంలో, ఆర్సీబీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక కొన్ని మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో నిర్వహిస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, చిన్నస్వామి స్టేడియంలో తిరిగి మ్యాచ్‌లు జరగనుండటం ఆర్సీబీ అభిమానులకు పెద్ద ఊరట.