Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 72 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో యూత్ వన్డేలలో విరాట్ కోహ్లీ 978 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వరల్డ్ కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 67 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టుకు కీలకమైన పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 107.46 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కుందు కూడా 80 పరుగులు చేయడంతో భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులు చేయగలిగింది.
25
కోహ్లీ రికార్డు బద్దలు..
బంగ్లాదేశ్‌పై వైభవ్ చేసిన ఈ ప్రదర్శన అతనికి ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడానికి సహాయపడింది. యూత్ వన్డేలలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో అతను విరాట్ కోహ్లీ యూత్ వన్డే రికార్డును బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 2006 నుంచి 2008 మధ్య యూత్ వన్డేలలో 978 పరుగులు సాధించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ కేవలం ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే కోహ్లీని అధిగమించి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
35
వైభవ్ దూకుడు..
వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 19 యూత్ వన్డే మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం అతని వయసు 14 సంవత్సరాలు మాత్రమే. దీంతో యూత్ వన్డేలలో మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయమని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత తరపున అండర్ 19 యూత్ వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విజయ్ జోల్ 36 మ్యాచ్‌లలో 1,404 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
నిబంధనల ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఒకే ఒక్క అండర్ 19 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ, యూత్ వన్డేలలో అతను అద్భుతమైన రికార్డులు సాధిస్తాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ టీమిండియా తలుపులు తట్టే దిశగా అడుగులు వేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.
55
అన్ని ఫార్మాట్లలోనూ విధ్వంసం..
యూత్ క్రికెట్‌లో ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతున్న వైభవ్, ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. అతని నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 15 ఏళ్లు నిండిన తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, అతను తన దూకుడును నిలకడగా కొనసాగించాలని సూచిస్తున్నారు.