
E-Cigatette : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 రసవత్తరంగా సాగుతోంది... ఈ సీజన్ ఆరంభంనుండి రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడుతోంది. యువ క్రికెటర్లతో నిండిన టీం ను చక్కగా నడిపిస్తున్నాడని కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యాటింగ్ లో పెద్దగా రాణించకపోయినా ఆర్ఆర్ టీం అతడి సారథ్యంలో వరుస విజయాలు అందుకుంది. తాజాగా అసలు ఓటమన్నదే ఎరగకుండా పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన పంజాబ్ కింగ్స్ ను ఓడించింది రాజస్థాన్.
అయితే పంజాబ్ పై రాజస్థాన్ విజయంతో పరాగ్ మరిన్ని ప్రశంసలు అందుకోవాల్సింది... కానీ అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు మైదానంలో అతడు వ్యవహరించిన తీరే కారణం. పంజాబ్ తో మ్యాచ్ సమయంలో పరాగ్ డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. దీంతో పరాగ్ పై ఐపిఎల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఐపిఎల్-2026 లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28, మంగళవారం) చండీగఢ్ లోని ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన స్థానిక జట్టు పంజాబ్ కింగ్స్ 222 పరుగులు చేసింది... దీంతో రాజస్థాన్ 223 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే అద్భుతమైన ఆరంభం అందించాడు. అయితే మిడిల్ ఓవర్స్ లో వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తంగా మారింది.
ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతున్న సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో ఔట్ కావడంతో అతడు కాస్త అసహనంగానే పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే ఫెర్రీరా, శుభమ్ ధూబే బ్యాటింగ్ చేస్తుండగా 16 ఓవర్ సమయంలో కెమెరా ఒక్కసారిగా రాజస్థాన్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూం వైపు మళ్లింది. అక్కడ ఆర్ఆర్ కెప్టెన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఔటైన కొద్దిసేపటికే ఈ సీన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ఈ పనిపై అభిమానులు మండిపడుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాళ్లకు కెప్టెన్‌గా ఏం సందేశం ఇస్తున్నావంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ నిబంధనల్లో వేపింగ్‌పై ప్రత్యేకంగా రూల్స్ లేకపోయినా స్టేడియం, డ్రెస్సింగ్ రూమ్‌లలో పొగాకు లేదా సంబంధిత ఉత్పత్తుల వాడకంపై బీసీసీఐ నిషేధం విధించింది. ఆటగాళ్ల ఆరోగ్య, భద్రతా నిబంధనల దృష్ట్యా బిసిసిఐ ఈ రూల్స్ పెట్టింది. ముఖ్యంగా మైదానంలో ఆటగాళ్లు సిగరెట్ తాగడం నిషేధం... డ్రెస్సింగ్ రూమ్ నాన్ స్మోకింగ్ జోన్.
బిసిసిఐ నిబంధనల ప్రకారం... క్రికెట్ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరిస్తే ఆటగాళ్లపై రిఫరీ చర్యలు తీసుకోవచ్చు. దీని ప్రకారం మ్యాచ్ ఫీజులో కోత విధించడం, ఫైన్ వేయడం లేదంటే తర్వాతి మ్యాచ్ లు ఆడకుండా సస్పెండ్ చేయవచ్చు. అంటే పరాగ్ వీటిలో ఏదో ఒక చర్య ఉండే అవకాశాలున్నాయి... అయితే అధికారికంగా ఈ వ్యవహారంపై ఐపిఎల్ మేనేజ్మెంట్ గానీ, బిసిసిఐ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.
రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రీడా నిబంధనలే కాదు భారతీయ చట్టాలను సైతం అతిక్రమించాడు. ఇండియాలో Prohibition of Electronic Cigarettes Act (PECA) 2019 ప్రకారం ఈ-సిగరెట్ పై నిషేధం ఉంది. అంటే ఈ-సిగరెట్ తయారుచేయడం, ఎగుమతి లేదా దిగుమతి చేయడం, స్టోర్ చేయడం, ప్రోత్సహించేలా ప్రకటనలు ఇవ్వడం వంటి చర్యలను నేరంగా పరిగణిస్తారు. అంటే వీటిని ఉపయోగించడం కూడా చట్టరిత్యా నేరమే.
ఇలా చట్టాలను అతిక్రమించి మొదటిసారి ఈ-సిగరెట్ ను వాడితే ఏడాది జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇక రెగ్యులర్ గా చట్టాలను అతిక్రమిస్తే 3 ఏళ్లు జైలుశిక్ష, 5 లక్షల రూపాయల ఫైన్ ఉంటుంది. ఈ-సిగరెట్లు స్టోర్ చేసినా ఆరునెలల వరకు జైలుశిక్ష విధించవచ్చు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఈ-సిగరెట్ తాగితే మరింత కఠిన శిక్షలు ఉంటాయి.. పరాగ్ చేసింది ఇదే. కాబట్టి అతడికి జైలు శిక్ష, ఫైన్ పడుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇదే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు మొబైల్ ఫోన్ వాడినందుకే రూ.1 లక్ష జరిమానా విధించారు. మరి కెప్టెన్ పరాగ్ ఏకంగా సిగరెట్ తాగాడు.. అతడిపై ఇంతకంటే కఠినమైన చర్యలు ఉండే అవకాశాలున్నాయి. ఐపిఎల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా..? బిసిసిఐ చర్యలు తీసుకుంటుందా..? లేదా పోలీసులు ఎంటరై అరెస్ట్ చేస్తారా..? అన్నది త్వరలోనే తేలనుంది.
సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో, 24 ఏళ్ల పరాగ్‌కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ దక్కింది. అయితే ఈ సీజన్‌లో అతను బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ కు ముందు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 81 పరుగులే చేశాడు. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ-సిగరెట్ వివాదం అతనికి పెద్ద తలనొప్పిగా మారింది.
అయితే పరాగ్ వివాదం ఎలా ఉన్నా పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. పరాగ్ ఔటయ్యాక చివరి ఓవర్లలో డొనావన్ ఫెరీరా (52*), శుభమ్ దూబే (31) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.