Chennai Super Kings: 36 బంతుల్లో సెంచరీతో అదరగొట్టిన ముంబై యువ సంచలనం ఆయుష్ వర్తక్ కు చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్ కోసం పిలుపునిచ్చింది. ధోని మరో మాస్టర్ ప్లాన్ వేసినట్టు దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఎవరీ ఆయుష్ వర్తక్?
ధోనీ మాస్టర్ ప్లాన్.. ముంబై కుర్రాడికి చెన్నై ట్రయల్స్.. ఇక రచ్చే!
ఐపీఎల్ మినీ వేలంలో ఎవరూ పట్టించుకోని ఒక యువ ఆటగాడికి అదృష్టం తలుపు తట్టింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల యువ యంగ్ ఆయుష్ వర్తక్ ను ట్రయల్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పిలిచింది. అండర్-23 క్రికెట్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నా వేలంలో అమ్ముడుపోని ఈ యువ సంచలనానికి, ఇప్పుడు ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేలో చేరే అవకాశం దక్కింది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన తర్వాత, తమ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయాలని చెన్నై భావిస్తోంది. గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో ఇప్పటికే ఆకాష్ మధ్వాల్‌ను తీసుకున్న సీఎస్కే, మరో ఖాళీ ఉన్న స్లాట్ కోసం ఆయుష్ వర్తక్ వైపు మొగ్గు చూపుతోంది.
24
అశ్విన్ ప్రశంసలు.. స్కౌటింగ్ టీమ్ ప్లాన్!
టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. సీఎస్కే స్కౌటింగ్ బృందం పనితీరును ఆయన కొనియాడారు. "భవిష్యత్తు కోసం మంచి కోర్ టీమ్‌ను నిర్మించడంలో సీఎస్కే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వేలాల మధ్యలో ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడం జట్టును బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గం. మహారాష్ట్రకు చెందిన యంగ్ ప్లేయర్ ఆయుష్ వర్తక్ కు శుభాకాంక్షలు" అని అశ్విన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
నిజానికి ఆయుష్ వర్తక్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ముఖ్యంగా ముంబై జూనియర్ టీమ్ తరపున ఆడుతూ కాంగా లీగ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక ఏడాది క్రితం కాలికి గాయమై రక్తం కారుతున్నా లెక్కచేయకుండా బ్యాటింగ్ చేసి తన పట్టుదలను చాటుకున్నాడు.
34
పరుగుల వరద.. సిక్సర్ల సునామీ
స్టేట్ ఏ ట్రోఫీ 2025లో ఆయుష్ వర్తక్ ఫామ్ అద్భుతం అని చెప్పాలి. కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 363 పరుగులు చేశాడు. ఇందులో 26 సిక్సర్లు ఉన్నాయి. ఎల్‌ఎస్‌జీ భారీ ధరకు కొనుగోలు చేసిన ముకుల్ చౌదరి తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఇతనే. ఈ టోర్నీలో 132, 92 నాటౌట్, 75 వంటి కీలక ఇన్నింగ్స్‌లతో ముంబై తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతేకాకుండా, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ (2024-26)లో 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 770 పరుగులు సాధించాడు. ఇందులో 192, 102, 105 వంటి భారీ సెంచరీలు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి 2024 సీజన్‌కు 'అండర్-23 అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్' అవార్డును కూడా అందుకున్నాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో స్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి, నెగటివ్ రన్ రేట్‌తో ఇబ్బంది పడుతోంది. తదుపరి మ్యాచ్ మే 2న సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరగనుంది. ఈ లోపే ఆయుష్ వర్తక్ ట్రయల్స్‌లో మెప్పిస్తే, అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
గతంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్ల ట్రయల్స్‌లో కూడా ఆయుష్ పాల్గొన్నాడు. కానీ, ఇప్పుడు సీఎస్కే ఇచ్చే అవకాశం అతని కెరీర్‌ను మలుపు తిప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇతను జట్టులోకి వస్తే, సీఎస్కే మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారే అవకాశం ఉంది.