Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!

Published : Apr 28, 2026, 05:53 PM IST

Unbreakable Cricket Records: టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో 344 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 27 సిక్సర్లు, 30 ఫోర్లతో పరుగుల వరదపారించింది.

PREV
16
టీ20 క్రికెట్‌లో ఊహకందని అద్భుతం.. వరల్డ్ రికార్డ్!

సాధారణంగా టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద. ఒకప్పుడు ఈ ఫార్మాట్‌లో 200 పరుగులు చేయడమే గొప్ప విషయం. కానీ, కాలక్రమేణా బ్యాటర్లు విశ్వరూపం చూపిస్తుండటంతో 250 నుంచి 270 పరుగులు కూడా నమోదవుతున్నాయి. అయితే, ఏకంగా 344 పరుగులు చేయడం ఎప్పుడైనా ఊహించారా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది నిజంగా జరిగింది. ప్రపంచ క్రికెట్‌లోని దిగ్గజ జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి జట్లకు కూడా సాధ్యం కాని ఈ అసాధారణ రికార్డును జింబాబ్వే జట్టు సొంతం చేసుకుంది. బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా జింబాబ్వే బ్యాటర్లు చెలరేగిపోయిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.

26
చరిత్ర సృష్టించిన జింబాబ్వే: 120 బంతుల్లో 344 పరుగులు

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ సందర్భంగా ఈ చరిత్రాత్మక మ్యాచ్ జరిగింది. నైరోబీలో గాంబియాతో జరిగిన ఈ పోరులో జింబాబ్వే జట్టు పరుగుల సునామీ సృష్టించింది. టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అది గాంబియా బౌలర్లకు పీడకల అవుతుందని ఎవరూ ఊహించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే కేవలం 4 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోరు సాధించింది. పురుషుల అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. నేపాల్ (314), భారత్ (297) జట్లు ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా లేవు.

36
సికందర్ రజా వీరవిహారం: 43 బంతుల్లోనే 133*

ఈ అసాధారణ స్కోరులో కెప్టెన్ సికందర్ రజాది కీలక పాత్ర. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచి రజా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లోనే 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఏకంగా 15 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. రజా స్ట్రైక్ రేట్ 309.30గా నమోదైంది. కేవలం రజా మాత్రమే కాదు, ఇతర బ్యాటర్లు కూడా గాంబియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ బ్రయాన్ బెనెట్ 26 బంతుల్లో 50 పరుగులు చేయగా, మారుమణి కేవలం 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు బాదాడు. చివరలో క్లైవ్ మదాండే 17 బంతుల్లో 53 పరుగులు చేసి స్కోరును 300 దాటించాడు.

46
మైదానమంతా బౌండరీలే: 27 సిక్సర్లు.. 30 ఫోర్లు

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 27 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించారు. దీనికి తోడు 30 ఫోర్లు కూడా వచ్చాయి. అంటే కేవలం బౌండరీల రూపంలోనే జింబాబ్వే జట్టు 282 పరుగులు రాబట్టింది. మైదానంలో ఏ బౌలర్ బంతి వేసినా అది బౌండరీ దాటాల్సిందే అన్నట్లుగా బ్యాటర్ల ఆట సాగింది. గాంబియా బౌలర్లు నిస్సహాయంగా చూస్తుండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు.

56
పేకమేడలా కూలిన గాంబియా.. 290 పరుగుల భారీ విజయం

345 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గాంబియా జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. జింబాబ్వే బౌలర్ల ధాటికి గాంబియా బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. కేవలం 14.4 ఓవర్లలో 54 పరుగులకే గాంబియా ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 290 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల పరంగా ఇది అతిపెద్ద విజయాల్లో ఒకటి. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగారవ, బ్రాండన్ మావుటా చెరో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు.

66
టీ20 క్రికెట్‌లో టాప్-5 అత్యధిక స్కోర్లు ఇవే

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

1. జింబాబ్వే - 344/4 (వర్సెస్ గాంబియా)

2. నేపాల్ - 314/3 (వర్సెస్ మంగోలియా)

3. భారత్ - 297/6 (వర్సెస్ బంగ్లాదేశ్)

4. జింబాబ్వే - 286/5 (వర్సెస్ సీషెల్స్)

5. భారత్ - 283/1 (వర్సెస్ దక్షిణాఫ్రికా)

Read more Photos on
click me!

Recommended Stories