Harmanpreet Kaur journey : పంజాబ్ లోని చిన్న పట్టణం మోగాలో పుట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ అనేక అడ్డంకులను జయించి భారత మహిళా క్రికెట్‌లో స్టార్ గా ఎదిగింది. ఐసీసీ ట్రోఫీ అందించి భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టింది.
చిన్న పట్టణం నుండి ప్రపంచ క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్
1989 మార్చి 8న పంజాబ్‌లోని మోగ పట్టణంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సాధారణ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ మొదట బాస్కెట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. ఆ తర్వాత న్యాయస్థానంలో క్లర్క్‌గా పనిచేశారు. తల్లి సత్విందర్ కౌర్ గృహిణి.
హర్మన్‌ప్రీత్ తండ్రి ఆమె క్రీడా ప్రస్థానానికి ప్రధాన ప్రేరణగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆయన తన కూతురిని జియాన్ జ్యోతి స్కూల్ అకాడమీలో క్రికెట్ శిక్షణకు పంపుతూ, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేశారు. కోచ్ కమల్దీప్ సింగ్ సోధీ వద్ద ఆమె కఠిన శిక్షణ తీసుకుంది. చిన్న వయసులోనే పురుష ఆటగాళ్లతో ఆడుతూ ధైర్యం, నైపుణ్యం పెంచుకుంది.
25
హర్మన్ ప్రయాణం అంతసులువుగా ఏం సాగలేదు !
హర్మన్‌ప్రీత్ ప్రయాణం అంత సులువైనది కాదు. ఆర్థిక కష్టాలతో పాటు మహిళలు క్రికెట్ ఆడటమా అనే ప్రశ్నలతో కూడిన వాతావరణంలో ఆమె ప్రయాణం మొదలైంది. ఉద్యోగ అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల్లో కూడా ఆమెకు లింగ ఆధారిత వివక్ష ఎదురైంది. కానీ ఆమె వెనుకడుగు వేయలేదు. కఠిన సాధనతో తన ప్రతిభను నిరూపించి క్రికెట్ తో పాటు చదువుల్లో రాణించింది. ఆర్థికంగా ఇబ్బందులు తగ్గడంతో మరింత సమయం క్రికెట్‌పై దృష్టి పెట్టగలిగింది.
35
టీమ్ ఇండియాలో కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళా జట్టులో కీలక స్థానాన్ని సంపాదించింది. ఆమె అన్ని ఫార్మాట్లలో భారత్‌కు నాయకత్వం వహించింది. కెప్టెన్ గా జట్టుకు అనేక విజయాలు అందించింది. వన్డేల్లో 48 మ్యాచ్‌లలో సుమారు 63.8% విజయాలు అందించింది. టీ20ఐల్లో 127 మ్యాచ్‌లలో 60.66% విజయాలతో జట్టును ముందుకు నడిపించింది. టెస్టుల్లో తన కెప్టెన్సీలో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.
2022లో ఆమె పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా నియమితురాలైంది. ఆమె నాయకత్వంలో భారత జట్టు అద్భుతమైన విజయాలతో దూసుకుపోయింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు చేరడం, ఆసియా కప్‌ను రెండు సార్లు గెలవడం వంటి ఘనతలు సాధించింది. ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్ ను భారత్ కు అందించింది.
2025 మహిళా వరల్డ్ కప్‌లో భారత మహిళా జట్టు తొలిసారి ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. ఆ విజయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం ఎంతో కీలకంగా నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. నడిన్ డి క్లర్క్ క్యాచ్‌ను అద్భుతంగా పట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆమె భావోద్వేగ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె నాయకత్వం మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త పుటను తెరిచింది.
55
హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డులు
హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా మొత్తం 178 మ్యాచ్‌లు ఆడి, 107 విజయాలు సాధించింది. దాదాపు 62.2% విజయ రేటు సాధించి భారత మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచింది.
బ్యాట్స్‌వుమన్‌గా కూడా ఆమె అద్భుత ప్రదర్శన చూపించింది. డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను రెండు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ కథ భారత మహిళా క్రికెట్‌కు స్ఫూర్తి. ఆర్థిక సమస్యలు, తిరస్కరణలు, లింగ వివక్ష.. ఇవన్నీ ఆమెను ఆపలేకపోయాయి. ఆమె చూపించిన పట్టుదల, నాయకత్వం, దేశ గౌరవాన్ని నిలబెట్టే ధైర్యం ఎంతోమంది యువతకు ఆదర్శం. 2025 వరల్డ్ కప్ విజయం ఆమె కెరీర్‌కే కాదు, భారత మహిళా క్రికెట్ చరిత్రకూ మైలురాయిగా నిలిచింది.