
నాగ్‌పూర్ లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్, తన హోదాకు తగ్గట్టుగానే మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న అభిషేక్.. ఆ తర్వాత కివీస్ బౌలర్లను హడలెత్తించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 సమీపిస్తున్న తరుణంలో, ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకమైనది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ప్రదర్శన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినా, అభిషేక్ శర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు.
అభిషేక్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం నుంచే పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. నాగ్‌పూర్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్.. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసే సమయానికి భారత్ 68/2 స్కోరు సాధించగా, అందులో 31 పరుగులు కేవలం 15 బంతుల్లో అభిషేక్ సాధించినవే కావడం విశేషం.
గణాంకాల ప్రకారం, అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో కొట్టిన సిక్సర్లలో 60 శాతానికి పైగా పవర్ ప్లేలోనే వచ్చాయి. ఈ విషయంలో ప్రపంచంలోని మరే ఇతర బ్యాటర్ కూడా అతనికి దరిదాపుల్లో లేరు. పవర్ ప్లేలో అభిషేక్ ఇప్పటివరకు 49 సిక్సర్లు కొట్టగా, తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 28 సిక్సర్లతో చాలా దూరంలో ఉన్నాడు. ఇది తొలి ఆరు ఓవర్లలో అభిషేక్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా అభిషేక్ శర్మ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 25 బంతుల కంటే తక్కువ వ్యవధిలో ఎక్కువసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.
ఇది అతనికి ఎనిమిదోసారి (25 బంతుల్లోపు 50 పరుగులు చేయడం). తద్వారా ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్, వెస్టిండీస్ విధ్వంసకరుడు ఎవిన్ లూయిస్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును (వీరందరూ 7 సార్లు సాధించారు) అభిషేక్ అధిగమించాడు. 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఈ ఘనత సాధించడం అభిషేక్ ప్రత్యేకత.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 1.5 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి కైల్ జేమిసన్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 2.5 ఓవర్లలో ఇషాన్ కిషన్ (8 పరుగులు) జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాదాపు 785 రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 99 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
సూర్య ఔటైనప్పటికీ అభిషేక్ తన జోరును తగ్గించలేదు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఇష్ సోధీ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. అతను ఔటయ్యే సమయానికి (11.6 ఓవర్లు) భారత్ స్కోరు 149/4 చేరింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం నాగ్‌పూర్‌లో మొదటి మ్యాచ్ జరగగా, మిగిలిన షెడ్యూల్ ఇలా ఉంది..
• రెండో టీ20: జనవరి 23 (రాయ్‌పూర్)
• మూడో టీ20: జనవరి 25 (గౌహతి)
• నాలుగో టీ20: జనవరి 28 (విశాఖపట్నం)
• ఐదో టీ20: జనవరి 31 (తిరువనంతపురం)
హెడ్ టు హెడ్ రికార్డ్: భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 25 టీ20లు జరగగా, భారత్ 12, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 3 మ్యాచ్‌లు టై అయ్యాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు.