Inspiring Story: ఆస్తి కోసం తల్లిదండ్రులని రోడ్డున పడేసే పిల్లల్ని చూశాం. కానీ ఓ కుర్రాడు తల్లి ప్రాణాలకై ఏం చేశాడో తెలిస్తే ఒళ్లు పులకరిస్తుంది. ఏ యుగంలోనూ ఇలాంటి సాహసం ఉండదేమో. తల్లిని బ్రతికించడానికి ఈ బీహార్ కుర్రాడు చేసిన ప్రతిజ్ఞ ఏంటో తెలుసా?
భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లో తల్లిదండ్రుల కోసం త్యాగం చేసిన పాత్రలకు కొదవలేదు. చూపులేని తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకెళ్లిన శ్రవణ కుమారుడు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదులుకున్న శ్రీరాముడు, తండ్రి కోసం రాజ్యాధికారాన్ని వదిలి బ్రహ్మచర్యం తీసుకున్నాడు భీష్ముడు. ఇవన్నీ ఈ కలియుగంలో సాధ్యమేనా? ఆస్తి కోసం, ప్రేమ కోసం తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు. కానీ బీహార్‌కు చెందిన ఈ 19 ఏళ్ల యువకుడు తల్లి కోలుకోవాలని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు 12 జ్యోతిర్లింగాల యాత్ర చేపట్టాడు. ఇప్పటికే ఆరు క్షేత్రాలను దర్శించుకున్నాడు.
26
8,000 కిలోమీటర్లు ప్రయాణించిన మోను
తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో చేసిన ఓ ప్రతిజ్ఞ.. ఇప్పుడు అతడిని వేల కిలోమీటర్ల ప్రయాణం వైపు నడిపిస్తోంది. అమ్మ ఆరోగ్యం మెరుగుపడితే దేశంలోని 12 జ్యోతిర్లింగాలను పరిగెత్తుతూ దర్శించుకుంటానని మొక్కుకున్నాడు.. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల మోను. ఆ మాట నిలబెట్టుకునేందుకు తన యాత్రను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 8,000 కిలోమీటర్లు ప్రయాణించి, ఆరు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు.
36
తల్లి అనారోగ్యంతో శివుడికి మొక్కు
బీహార్‌లోని అరారియా జిల్లాకు చెందిన మోను తల్లి లాల్తీ దేవి అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం తింటున్న సమయంలో గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఎన్నో చోట్ల వైద్యం చేయించినా తగ్గలేదు.
ఆ సమయంలో మోను జెహనాబాద్‌లోని బరాబర్ కొండపై ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో శివుడిని ప్రార్థించి ఓ మొక్కు మొక్కుకున్నాడు. తల్లి కోలుకుంటే దేశంలోని 12 జ్యోతిర్లింగాలను పరిగెత్తుతూ దర్శించుకుంటానని మోను మొక్కుకున్నాడు. లాల్తీ దేవి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మోను తన మొక్కును నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 15న పాట్నా నుంచి యాత్ర ప్రారంభించాడు.
మోను తన యాత్రలో రోజుకు సుమారు 50 కిలోమీటర్లు పరిగెత్తాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 8,000 కిలోమీటర్లు ప్రయాణించి ఆరు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న అతను మిగిలిన క్షేత్రాలను కూడా సందర్శించి తన ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయాణంలో మరో ఇద్దరు యువకులు అతనితో కలిసి వెళ్తున్నారు.
56
క్రికెట్ నుంచి సుదీర్ఘ యాత్ర వరకు
మోను ఆరో తరగతి నుంచే క్రికెట్ ఆడేవాడట. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడేందుకు గోల్గప్పాలు, చాట్ అమ్మడంతో పాటు ఎలక్ట్రికల్ పనులు కూడా చేసేవాడు. మోను తండ్రి మహేశ్ చౌహాన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మోను చిన్నప్పటి నుంచే భక్తి ఉందని తెలుసుకానీ...ఇంత పెద్ద యాత్ర చేపడతాడని ఊహించలేదని ఆయన తండ్రి తెలిపారు. యాత్ర ప్రారంభంలో కుటుంబ సభ్యులు కొంత డబ్బు ఇవ్వగా, మిగతా ఖర్చులను మోను చూసుకుంటున్నాడట.
66
కొడుకు ప్రేమపై తల్లి ఆనందబాష్పాలు
తన కుమారుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇంతటి ప్రయాణం చేయడం గర్వంగా ఉందని లాల్తీ దేవి చెబుతున్నారు. మోను తండ్రి, సోదరుడు కూడా అతని పట్టుదలను ప్రశంసిస్తున్నారు. యాత్ర పూర్తిచేసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసి, రోడ్డన పడేసే పిల్లలెక్కడ? ఈ మోను ఎక్కడ? ఇలాంటి వాళ్లను పురాణాల్లోనో, కథల్లోనో చూసే ఉంటాం. కానీ ఈ కలియుగంలో చూడటం అద్భుతమనే చెప్పాలి.