గత రోజుల్లో భర్త అంటే భార్యకి దైవంతో సమానం. భర్త అడుగుజాడలలో నడవడమే అదృష్టం అనేట్లుగా నడుచుకునేది కానీ ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి కారణంగా భర్తని పేరు పెట్టి పిలవటమే కాదు అరేయ్ ఒరేయ్ అని కూడా పిలుస్తున్నారు నేటి భార్యలు.
ఏకాంత సమయంలో ఎలా పిలుచుకున్నప్పటికీ నలుగురిలో ఉన్నప్పుడు అలాగే పిల్లల ముందు భర్తని పేరు పెట్టి పిలిస్తే అది మీ భర్తకి గౌరవం తగ్గించడమే అవుతుంది. అంటే అది మీకు కూడా గౌరవభంగమే. భార్యాభర్తల సంబంధాలపై పాశ్చాత్య దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయి.
కానీ మనం మాత్రం పాశ్చాత్య ధోరణిలో భర్తని పేరు పెట్టి పిలుస్తున్నాము అలా కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు ఏమండీ అని గాని ఏమయ్యా అని గాని పిలవడం వల్ల భర్తని గౌరవించినట్లు అవుతుంది.
మీ ద్వారా మీ పిల్లలు కూడా ఆ తండ్రిని గౌరవిస్తారు. అదే భర్తని ఏకాంతంలో ఉన్నప్పుడు బుజ్జి, బంగారం అని పిలవడం వల్ల నీకోసం ఏమైనా చేస్తాను అనే పరిస్థితికి వచ్చేస్తారంట మగవాళ్ళు. భార్యాభర్తలిద్దరూ కోపంగా ఉన్నప్పుడు భార్య భర్తని ప్రేమగా ఏమండీ అని కానీ శ్రీవారు..
అని పిలిచినా కానీ మీ ఆప్యాయత మీ భర్త కి అర్థమవుతుంది. దానివలన అతనిలో భావోద్వేగాలు తగ్గుతాయి అంట. అదే పరిస్థితుల్లో భర్తని అరేయ్ అని పిలవటం వల్ల పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారుతుందంట.
అందుకే పిలుపులో ఏముంది అనుకోకండి. ఏకాంతంగా ఉన్నప్పుడు ఏ విధంగా పిలుచుకున్నా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం మీ భర్తకి గౌరవం పెరిగేలా మీ పిలుపు ఉండేలాగా చూసుకోండి.