క్రమశిక్షణ, విలువలు, పెద్దల్ని గౌరవించడం, నిజాయతీ... ఇలాంటివి పిల్లాడికి చెబితే రావు. పెద్దవాళ్లని చూసే నేర్చుకుంటారు. రోజూ ఉదయాన్నే నిద్ర లేచి చదువుకోవాలి అని పిల్లాడికి చెబితే తలకెక్కించుకోడు. మనమూ ఆ పని చేయాలి. మనం మన పెద్దలకు గౌరవం ఇస్తే అది చూసి నేర్చుకుంటాడు. ఇంట్లో నిత్యం గొడవలు, అరుచుకోవడాలు ఉంటే అది పసి మనసుపై ఎంతో ప్రభావం చూపుతుంది.
బాధ్యత
నాన్నకు ఎన్నో బాధ్యతలు. కుటుంబాన్ని చక్కబెట్టడం, పిల్లల్ని చదివించడం, అనారోగ్యం వస్తే ఆసుత్రికి తీసుకెళ్లడం, ఉద్యోగం చేయడం, పిల్లల పెళ్లిళ్లు.. ఇవన్నీ సక్రమంగా చేస్తుంటే తన పిల్లాడు చూస్తూ పెరుగుతాడు. ఇవన్నీ పురుషుడి బాధ్యతలు అని తెలుసుకుంటాడు. సమయానికి హోంవర్క్ చేయడం, ఇంటిపనుల్లో సాయం చేయడం, వయసు పెరుగుతున్నకొద్దీ చిన్నచిన్న పనులు సొంతంగా చేయడం, కుదిరితే చిన్నచిన్న పనులు చేసి డబ్బులు సంపాదించడం.. ఇవన్నీ నేర్పిస్తుండాలి.
father son
అతి గారాబం చేయడం, అడిగిందల్లా కొనివ్వడం.. ఇలాంటి వాటితో పిల్లలకు డబ్బు విలువ తెలియదు. ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. మనం చేసే దుబారా ఇతరులకు జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజెప్పాలి. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం చెప్పాలి. అవసరాలేంటో, విలాసాలేంటో తెలియజేసినప్పుడే జీవితంలో కొడుక్కి డబ్బు విలువ తెలుస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తుల జీవితంలో ఏమీ సాధించలేరనే విషయం తెలియజెప్పాలి.
సమాజంలో మహిళలపై నిత్యం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లను చులకనగా చూస్తున్నారు. మగాళ్లు ఇలా రాక్షసుల్లా ప్రవర్తించడానికి కారణం ఇంట్లో పెరిగిన వాతావరణమే. ఇంటి యజమాని తన భార్య, తల్లికి గౌరవం ఇవ్వకపోతే అతడి కొడుక్కీ ఆడవాళ్లంటే చులకనభావం ఏర్పడుతుంది. నాన్న ఇతర మహిళలను గౌరవించినప్పుడే కొడుకూ నేర్చుకుంటాడు. అమ్మాయిలను ఎలా గౌరవించాలో చెప్పినప్పుడే పిల్లలూ నేర్చుకుంటారు.
చేపట్టిన ప్రతి పనీలో విజయం సాధించలేం. అది చదువు, ఉద్యోగం, ఎంచుకున్న రంగం.. ఏదైనా కావొచ్చు. వైఫల్యాలు బాధిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేరు. అలాంటప్పుడే ఇవన్నీ జీవితంలో భాగం అని చెప్పగలగాలి. పడినా బలంగా లేవాలి.. ముందుకు సాగాలి అని భరోసా ఇవ్వాలి. అప్పుడే పరీక్షలో ఫెయిలైన విద్యార్థి తనువు చాలించడం, ప్రేమలో విఫలమైన కుర్రాడు సూసైడ్ చేసుకోవడం లాంటివి తగ్గుతాయి.