సాధారణంగా చాలామంది క్షమాపణ చెప్పడానికి ఇష్టపడరు. తప్పు వారిదైనా సరే సారీ చెప్పడం చిన్నతనంగా, అవమానంగా భావిస్తుంటారు. అయితే చాణక్య నీతి ప్రకారం ఆత్మ గౌరవం పోకుండా ఎలా క్షమాపణ చెప్పాలో ఇక్కడ తెలుసుకుందాం.
వినయంలోనే అసలైన శక్తి
చాణక్య నీతి ప్రకారం వినయంలోనే అసలైన శక్తి ఉంది. ఎవరైనా పొరపాటు తెలుసుకుని క్షమాపణ కోరితే అది బలహీనత కాదు. పరిణితి చెందిన మనస్తత్వానికి నిదర్శనమని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.
తప్పు చేయకపోతే?
చాలాసార్లు తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పాల్సి వస్తుంటుంది. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా తప్పు చేయకపోతే క్షమాపణ అడగకూడదు. ఇలాంటి సందర్భాల్లో క్షమాపణ అడిగితే వారి గౌరవం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
తప్పు చేసినప్పుడు సారీ ఎప్పుడు చెప్పాలి?
చాణక్య నీతి ప్రకారం తప్పు చేసినా సరే క్షమాపణ అడిగేటప్పుడు ఆత్మగౌరవం గురించి ఆలోచించాలి. ఎదుటివారు కోపంలో ఉన్నప్పుడు క్షమాపణ అడగకూడదు. అప్పుడు సరిగ్గా మాట్లాడలేం. కోపం తగ్గిన తర్వాత మాట్లాడి క్షమాపణ అడగాలి.
మీ మాటల వల్ల ఎవరైనా బాధపడితే?
చాణక్య నీతి ప్రకారం మన వల్ల ఎవరైనా బాధ పడితే ముందుగా వారి మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి మానసిక స్థితిని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. వారు స్థిమితంగా ఉన్నప్పుడు క్షమాపణ కోరడం మంచిది.
ఎదుటి వ్యక్తి క్షమించాలని లేదు
చాణక్య నీతి ప్రకారం ఎవరైనా తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే అవతలి వ్యక్తి వెంటనే క్షమించాలని లేదు. క్షమాపణ అడిగితే చర్చ వేరే విధంగా మారొచ్చు. లేదా పాత విషయాలు మళ్లీ మొదలు కావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి.
తప్పు సరిదిద్దుకోవడానికి..
చాణక్య నీతి ప్రకారం, పదే పదే తప్పులు చేసి క్షమాపణ అడిగితే గౌరవం ఉండదు. తప్పుల నుంచి నేర్చుకోవడం, మళ్లీ చేయకుండా ఉండటమే గౌరవంగా ఉంటుంది.